బీహార్‌లో విపక్ష కూటమి మళ్లీ కలవబోతుందా? మునుపటి స్నేహమే కొనసాగించబోతున్నారా? ఎన్నికల ముందు మాస్టర్ ప్లాన్ వేశారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవే సంకేతాలు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఏకతాటిపై ఉన్న కూటమి.. సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో చివరి నిమిషంలో ఎవరికి వారే వేరైపోయారు.
అయితే తత్వం బోధపడితే గానీ జ్ఞానోదయం రాదన్నట్టుగా దీపావళి తర్వాత ఇండియా కూటమికి మేల్కొలుపు వచ్చింది. విపక్ష కూటమి బలహీనతను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకోవడంతో రాజకీయ పండితుల హెచ్చరికలతో కూటమి అప్రమత్తమైంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది. తిరిగి కూటమిని ఏకతాటిపైకి తెచ్చేందుకు అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగారు. బుధవారం పాట్నా చేరుకున్న ఆయన.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Droupadi Murmu: కేరళ పర్యటనలో రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం
తేజస్వి యాదవ్‌ను ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు వర్గాలు పేర్కొన్నాయి. ఇదే అంశాన్ని తేజస్వి యాదవ్‌తో అశోక్ గెహ్లాట్ చర్చించి.. తిరిగి కూటమిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయొచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తర్వాత మహాఘటబంధన్ నాయకులంతా ఐక్యంగానే ఉన్నారనే సందేశాన్ని బీహార్ ప్రజలకు పంపించవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mamdani-Modi: భారత్‌లో కొంతమందికే చోటుంది.. దీపావళి వేడుకలో మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి విమర్శలు
ప్రస్తుతం బీహార్ ఎన్నికల పరిశీలకులుగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను కాంగ్రెస్ నియమించింది. అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే అన్ని గందరగోళాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు చక్కదిద్దబడతాయని.. విపక్ష కూటమి ఎన్నికల్లో బలంగా పోటీ చేస్తుందని సంకేతం ఇచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు వేర్వేరుగా నామినేషన్లు వేశారు. బుధవారం కాంగ్రెస్-ఆర్జేడీ నేతల సమావేశం తర్వాత పరిస్థితులు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నామినేషన్లు వేసిన చోట స్నేహపూర్వక పోటీ ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే చాలా చోట్ల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సమావేశం తర్వాత ఉమ్మడి మీడియా సమావేశం కూడా నిర్వహించనన్నారు. ప్రెస్‌మీట్ ద్వారా ఐక్యత సందేశాన్ని పంపనున్నట్లు వర్గాలు తెలిపాయి.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
