CM Vijay First Signatures: సీఎం విజయ్‌ తొలి సంతకాలు సంచలనం.. ఇక, ఇవి ఫ్రీ

Cm Vijay First Signatures

Cm Vijay First Signatures

CM Vijay First Signatures: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత సి. జోసెఫ్‌ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అర్లేకర్ విజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయ్‌కు ఘన స్వాగతం పలికారు.

తొలి సంతకాలతోనే కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆయన తొలి నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పై సీఎం విజయ్ తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని మధ్యతరగతి, పేద కుటుంబాలకు భారీ ఊరటనివ్వనుంది. అదే విధంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళా భద్రతపై రెండో సంతకం చేసిన విజయ్, షీటీమ్‌ తరహాలో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

డ్రగ్స్‌ నిరోధానికి స్పెషల్‌ టీమ్‌
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రగ్స్ నిరోధక బృందాన్ని ఏర్పాటు చేస్తూ సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తూ కూడా సీఎం విజయ్ సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మహిళలకు ప్రయాణ ఖర్చులో ఉపశమనం కలగనుంది. ఇక, ప్రమాణస్వీకారం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన విజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “నేను మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని. మీకు అన్నగా, తమ్ముడిగా ఉంటాను. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు” అంటూ ప్రజలతో తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు.