Isha Foundation: భారతీయ సైనికులకు క్లాసికల్ హఠ యోగా శిక్షణను అందించనున్నారు. భారత సైన్యంలోని 10వేల మందికి ఈశా ఫౌండేషన్ క్లాసికల్ హఠ యోగా శిక్షణను అందించనుంది. ఇందుకోసం భారత సైన్యంతో ఈశా ఫౌండేషన్ చేతులు కలిపింది. ఆగస్టు 15న సికింద్రాబాద్‍లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 20 వరకు కొనసాగనుంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈశా ఫౌండేషన్, సదరన్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీతో చేతులు కలిపి “ఒత్తిడి నిర్వహణ మరియు పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా” అనే ప్రోగ్రామ్‍ని ప్రారంభించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆర్మీ కమాండ్ అధికార పరిధిలోకి వచ్చే 9 రాష్ట్రాల్లోని 23 ప్రదేశాలలో 10,000 కు పైగా సైనికులకు ఈశా హఠ యోగా టీచర్లచే ఉచితంగా వారం రోజులు క్లాసికల్ హఠ యోగా ప్రోగ్రాములు నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీన సికింద్రాబాద్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటూ ఒత్తిడికి గురయ్యే మన సైనికులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం.
Read also: Anil Pawar: చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తూ.. జల్సాలు చేస్తున్న యువకుడు అరెస్ట్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రారంభోత్సవ వీడియో సందేశంలో .. “సైనికులుగా మీరు మీ శారీరక దృఢత్వానికి, శ్రేయస్సుకు సరిపడినంత శిక్షణ తీసుకున్నారు. కానీ మనోస్థైర్యాన్ని, శక్తి సామర్థ్యాలని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి, యోగా ఇంకా అంతర్గత శ్రేయస్సుని చేకూర్చే సాంకేతికతలు మీలో అసాధారణమైన మార్పుని తీసుకువస్తాయి. మేము ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులకు, ఇతర దళాలకు ఈ యోగ ప్రక్రియలను నేర్పించాము. అలాగే 300లకు పైగా ట్రైనర్లకు శిక్షణ కూడా ఇచ్చాము. ఇప్పుడు దీనిని ముఖ్య విభాగమైన సదరన్ కమాండ్‌కు అందించాలనుకుంటున్నాము అని తెలిపారు.
“దేశ సంరక్షణకు మనస్ఫూర్తిగా తమ జీవితాలను అంకితం చేసి, యూనిఫామ్ ధరించిన పురుషులు, స్త్రీలు దేశానికి నిబద్ధతతో మహోన్నత సేవలను అందిస్తున్నారు. ప్రధానంగా మన సంస్కృతిలోని అద్భుత సాధనాలను, వారికి అందుబాటులోకి తేవడం ద్వారా వారిలో సమతుల్యత, స్థిరత్వం మరియు అంతరంగ శ్రేయస్సును పెంపొందించవచ్చు. విశేషంగా ఈశా క్లాసికల్ హఠ యోగాని ఇండియన్ ఆర్మీలోని సదరన్ కమాండ్‍కు నేర్పించడం ద్వారా, మీలో మనోస్థైర్యం, శక్తిసామర్థ్యాలు మరో స్థాయికి వెళతాయి. అలాగే, మీరు పని చేసే తీరులో ఇంకా అన్నిటికీ మించి మీరు జీవితాన్ని అనుభూతి చెందే విధానంలో ఎంతో మార్పుని గమనిస్తారు… శుభాశీస్సులు” అంటూ ఈ కార్యక్రమం గురించి సద్గురు ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్, సదరన్ కమాండ్ ఈ వేడుకను ప్రారంభించి, భారత సైన్యంలో మనో స్థైర్యానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. యోగా చేయడం వల్ల సాధారణ సమాజంలో ప్రబలంగా ఉన్న మానసిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి, ప్రత్యేకంగా భారత సైన్యానికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. ఒత్తిడి, ఆత్మహత్యలు ఇంకా వైవాహిక విబేధాలు అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మన సాంస్కృతిక సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి మళ్ళీ చేరువ అవ్వడం ఎంతో ముఖ్యం. మన సంస్కృతికి చేరువ అవడానికి సహకరించిన సద్గురుకు నేను కృతజ్ఞుడను” అని లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ అన్నారు.
Read also:Adani Group: మరింత పెరగనున్న అదానీ ‘పవర్’.. 2బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న అబుదాబి కంపెనీ
GOC-in-C పంచకోశ సిద్ధాంతం ప్రకారం ఐదు లేయర్ల వ్యక్తిత్వం గురించి ప్రేక్షకులతో మాట్లాడారు. భారతీయ సైనికుల మనో స్థైర్యం కోసం ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. సదరన్ కమాండ్‍కు యోగా భాగస్వామిగా ఉంటున్న ఈశా ఫౌండేషన్, వారికి అందిస్తూ వస్తున్న ఇంకా భవిష్యత్తులో అందించనున్న ప్రోగ్రాములను గురించి ఆర్మీ కమాండర్ మాట్లాడారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈశా యోగ కేంద్రం వద్ద 21 వారాల టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‍లో పాల్గొన్న ఈశా హఠ యోగా టీచర్లు, సైనికులకు సూర్య క్రియ, అంగమర్దన వంటి క్లాసికల్ హఠ యోగా ప్రాక్టీసులను నేర్పిస్తారు. ఇందులో సైనికులు నాడి శుద్ధి కూడా నేర్చుకుంటారు. ఇది నాడుల్ని అంటే ప్రాణశక్తి ప్రవహించే మార్గాలని శుద్ధి చేసి సమతుల్యతను, మానసిక శ్రేయస్సును చేకూర్చుతుంది; ఉరుకుల పరుగుల ఆధునిక జీవన వేగాన్ని ఎదుర్కోవటానికి రూపొందించిన ఈశా క్రియ, 12 నిమిషాల ధ్యాన ప్రక్రియ కూడా నేర్చుకుంటారు. ముంబై, పుణే, అహ్మదాబాద్, గ్వాలియర్, ఝాన్సీ, సికింద్రాబాద్, చెన్నై ఇంకా బెంగళూరు మొదలగు నగరాలలో వేల సంఖ్యలో సైనికులు మొట్టమొదటి బ్యాచ్‍లో పాల్గొనున్నారు. అంతేకాకుండా ఈ ప్రాక్టీసులను వారు కొనసాగించేలా చూసుకోవడానికి కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ వద్ద సెప్టెంబర్ 1 నుండి 14వ తేది వరకు ట్రైనర్లకి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ నిర్వహించి, ఇందులో సదరన్ కమాండ్‌లోని యూనిట్ల నుండి కొంతమంది శిక్షకులను ఎంపిక చేస్తారు. వీళ్లు రాబోయే కాలంలో వారి యూనిట్‌లో జరిగే యోగా ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి సర్టిఫైడ్ ట్రైనర్‌లుగా శిక్షణ పొందుతారు. గౌరవనీయులు రాజా ఉపాధ్యాయ, HDFC బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, HDFC బ్యాంక్ పరివర్తన్‍కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సైనికులకు శ్రేయస్సును చేకూర్చడానికి ఈశా ఫౌండేషన్‍తో HDFC బ్యాంక్ పరివర్తన్ చేతులు కలిపింది.