CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..

  • ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన CJP కార్యకర్తలపై దాడి ఆరోపణలు.
  • రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌కు 48 గంటల అల్టిమేటం.
  • దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్.
  • దాడికి పాల్పడిన వారు బీజేపీ గుండాలే అనే ఆరోపణలు..
Cjp Protest

Cjp Protest

CJP: రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాల పర్యటనకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై గ్రామస్తులు దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే, బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడినట్లు సీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు, దాడి చేసిన గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా రాజస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించారు. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ లాల్ రాజీనామాను కోరుతున్నారు.

దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలనున ప్రజలు స్వయంగా పరిశీలించడంపై విధించిన ఆంక్షల్ని ఉపసంహరించుకోవాని రాంకా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను 48 గంటల్లో తీర్చకపోతే రాజస్థాన్ వ్యాప్తంగా భారీ ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సారి తమ పోరాటం కేవలం పాఠశాలల సమస్యలకే పరిమితం కాదని, విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ రాజీనామాను డిమాండ్ చేస్తామని హెచ్చరించారు.

శుక్రవారం ఉదయం రాంపురా-కన్వార్‌పురా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సీజేపీ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు పార్టీ కార్యకర్తలు అక్కడి వెళ్లారని, ఈ పాఠశాల కొన్నేళ్లుగా పశువుల కొట్టంలోనే కొనసాగుతోందని రాంకా ఆరోపించారు. బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులు తమపై దాడి చేసినట్లు చెప్పారు. తమ వాహనాల అద్దాలు పగులగొట్టారని, మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని, ఓ మహిళా కార్యకర్తపై దాడి చేశారని, తన చొక్కాను చించేశారని రాంకా ఆరోపించారు. పోలీసులు ముందే సమాచారం ఇచ్చినా ఘర్షణను అడ్డుకోలేదని చఅన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకే దాడి జరిగిందని ఆరోపించారు.