Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని అన్యాయంగా చంపేశారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కార్యాలయాలపై భీకరదాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత సైనిక స్థావరాలపై, ప్రజలపై దాడులకు యత్నించడంతో భారత్ పాకిస్తాన్ వైమానికి దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
Read Also: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
అయితే, నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంఘర్షణలో భారత్‌కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లు కూలిపోయాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదంతా చైనా చేసిన తప్పుడు ప్రచారమని యూఎస్ నివేదిక ఒకటి వెల్లడించింది. చైనా తన సొంత తయారీ ఫైటర్ జెట్ J-35లకు అనుకూలంగా ఫ్రెంచ్ రాఫెట్ జెట్ అమ్మకాలను అడ్డుకోవడానికి తప్పుడు సమచారాన్ని ప్రారంభించిందని అమెరికా రిపోర్ట్ వెల్లడించింది. రాఫెట్ ఫైటర్ జెట్ గొప్పతనాన్ని దెబ్బతీసేందుకు చైనా రహస్య ప్రచారాన్ని నిర్వహించిందని ఫ్రెంచ్ నిఘా, సైనిక అధికారులు ఆరోపించిన కొన్ని నెలల తర్వాత ఈ నివేదిక వచ్చింది.
ఫ్రెంచ్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ.. ఈ తప్పుడు ప్రచారం కోసం చైనా ఏఐ చిత్రాలను, నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించిందని నివేదిక పేర్కొంది. రాఫెల్ జెట్ కొనుగోలు ఇండోనేషియా నిలిపేసేలా చైనా ఒప్పించిందని, ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకు చైనా తన సైనిక పరికరాల ఎగుమతుల్ని పెంచిందని నివేదిక చెప్పింది. చైనా జూన్ 2025లో పాకిస్తాన్‌కు 40 J-35 ఐదవ తరం ఫైటర్ జెట్‌లు, KJ-500 విమానాలు మరియు బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించడానికి ఆఫర్ చేసినట్లు కూడా నివేదిక పేర్కొంది. అదే నెలలో పాక్ రక్షణ బడ్జెట్ 2025-26 కోసం 20 శాతం పెరిగిందని తెలిపింది.