కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు డీకే.శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారని ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇక కర్ణాటకలో పరిస్థితిని గమనించిన హైకమాండ్.. దూతలను పంపి ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చించారు.
ఇది కూడా చదవండి: Mallu Bhatti Vikramarka: త్వరలోనే ‘రోహిత్ వేముల చట్టం’.. ఆత్మహత్యకు న్యాయం జరగాలి..!
తాజాగా అధిష్టానం పెద్దలను కలిసేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హస్తినకు వెళ్లారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని కలవాల్సి ఉండగా భువనేశ్వర్‌లో ప్రజా ర్యాలీ కారణంగా అక్కడికి వెళ్లిపోయారు. దీంతో ఏఐసీసీ పెద్దలను, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను సిద్ధరామయ్య కలిశారు. భేటీ అనంతరం సిద్ధరామయ్యను విలేకర్లు ప్రశ్నించారు. నాయకత్వ మార్పు గురించి చర్చించారా? అని జర్నలిస్టులు అడగగానే ముఖ్యమంత్రి రుసరుసలాడారు. సహనం కోల్పోయిన ఆయన… నాయకత్వ మార్పు లేదని ఎన్ని సార్లు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గేతో అలాంటి చర్చలే జరగలేదని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కలవడం వెనుక ఉద్దేశ్యం.. ముఖ్యమంత్రి మార్పు గురించి కాదని సుర్జేవాలా స్పష్టంగా చెప్పారని సిద్ధరామయ్య విలేకరులకు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Ajit Doval: “భారత్ నష్ట పోయినట్లు ఒక్క ఫొటో చూపించండి”.. మీడియాపై అజిత్ దోవల్ ఫైర్..
ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని డీకే.శివకుమార్ ప్రత్యేకంగా కలిశారు. సమావేశం తర్వాత ఏం చర్చించారని విలేకర్లు ప్రశ్నించగా… ఏమీ చెప్పకుండానే శివకుమార్ వెళ్లిపోయారు. మొత్తానికి ఢిల్లీలో ఏదో జరుగుతుందంటూ జాతీయ స్థాయిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.