Site icon NTV Telugu

India Pakistan: భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్తాన్‌లో ఎండిపోయిన చీనాబ్ నది..

India Pakistan

India Pakistan

India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.

26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ దాడి తర్వాత, భారత్ ఉగ్రవాదంపై మరింత అణిచివేత ఉంటుందని చెప్పింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లు, పాక్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీంతో భారత్, పాక్‌పై దౌత్య చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌లో 80 శాతం జనాభాకు జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంది. ఈ చర్యలో పాక్ భయపడుతోంది. దీనిని తాము ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తామని చెప్పింది. సింధు జలాలను అడ్డుకుంటే, భారత్ పై దాడి చేస్తామని పాక్ హెచ్చరిస్తోంది.

Read Also: Cabinet Decisions: జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’.. కేంద్రం సంచలన నిర్ణయం..

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కి అసలు దెబ్బ రుచి చూపించింది భారత్. చీనాబ్ నది జలాలను భారత్ నిలిపేయడంతో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోయింది. కేవలం 4 రోజుల్లోనే నదిలోని ప్రవాహం కనుమరుగైంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ ఎన్ని దాడులు, యుద్ధాలు చేసినా, 1960లో జరిగిన ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ జోలికి భారత్ వెళ్లలేదు. కానీ, దీనిని ఆసరగా చేసుకుంటూ పాక్ పదేపదే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం, భారతదేశానికి రవి, బియాస్, సట్లేజ్ నదులపై హక్కులు ఉంటే, పాకిస్తాన్‌కి సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్ గొంతు ఎండటం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version