మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఏకంగా 38 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’పై తమకు నమ్మకం లేదని.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమెటం జారీ చేశారు.
తాజాగా ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన 15 మంది శివసేన ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో ‘వై ప్లస్’ కేటగిరి భద్రతను కల్పించింది. ఎమ్మెల్యేలు ప్రకాష్ సర్వే, సదానంద్ సర్వాంకర్, యోగేష్ దాదా కదమ్, ప్రతాప్ సర్నాయక్, రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ షిర్సత్, లతాబాయి సోనావానే, యామిని జాదవ్ , ప్రదీప్ జైస్వాల్, సంజయ్ రాథోడ్, దాదాజీ భూసే, దిలీప్ లాండే, బాలాజీ కళ్యానర్, సందీపన్ భూమారే లకు భద్రతను పెంచింది కేంద్ర ప్రభుత్వం.
ఇటీవల తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే, తన వర్గం ఎమ్మెల్యేల కుటుంబాలకు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకుంటుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసిన ఒక రోజు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శివసేన పార్టీలోని మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గంలోనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ షిండే శిబిరంలో చేరారు. దీంతో షిండే వర్గంలో చేరిన 8 మంత్రి ఈయన. ఇదిలా ఉంటే రెబెల్ ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడులు చేస్తున్న క్రమంలో మహారాష్ట్ర పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. థానే, ముంబై ప్రాంతాల్లో శివసేన రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు.