ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొన్ని శక్తులపై నిఘా ఉంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సోషల్, డిజిటల్ వేదికలపై దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘాను తీవ్రతరం చేయాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.
Read Also: Operation Sindoor Live Updates: పాక్కి వెన్నులో వణుకు పుట్టించిన భారత్.. లైవ్ అప్డేట్స్..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం కీలక సలహా ఇచ్చింది. ఆపరేషన్ గురించి లేదా భారత దేశ భద్రతా పరిస్థితి గురించి నకిలీ కథనాలు వ్యాప్తి చేసే సోషల్ మీడియా అకౌంట్లపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని కోరింది. దేశంలో లేదా విదేశాల నుంచి ఎక్కడనుంచైనా భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69A ప్రకారం, జాతీయ భద్రత లేదా ప్రజా క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ కంటెంట్‌కు యాక్సెస్‌ని పరిమితం చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీంతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో స్థానిక పరిపాలన, సాయుధ దళాలు, పారామిలిటరీ యూనిట్ల మధ్య సన్నిహిత సమన్వయం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్స్ పెంచాలని పిలుపునిచ్చింది.
