NTV Telugu Site icon

Khalistan Referendum: ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఎదురుదెబ్బ.. రెఫరెండానికి కెనడా అనుమతి నిరాకరణ..

Khalistan Referendum

Khalistan Referendum

Khalistan Referendum: ‘ఖలిస్తాన్’ పేరుతో భారత్ పై ఖలిస్తానీవాదులు విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని కొంతమంది ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కెనడా వ్యాప్తంగా ఖలిస్తాని మద్దతుదారులు ‘ఖలిస్తాన్ రెఫరెండం’ పేరుతో నానా హంగామా సృష్టిస్తున్నారు. భారత్ నుంచి పంజాబ్ విడగొట్టి ఖలిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఖలిస్తాన్ రెఫరెండంపై ఓటింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ముఖ్యంగా ఏకే-47 పోస్టర్లతో ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రచారం చేసిన కారణంగా అనుమతి నిరాకరించారు అక్కడి అధికారులు. ఖలిస్తాన్ రెఫరెండం కోసం కెనడా భూభాగాన్ని వినియోగించడంపై భారత్ పలుమార్లు తన అసహనం వ్యక్తం చేసింది.

Read Also: G20 Summit: జీ20 సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు.. ప్రీమియర్ వస్తారని స్పష్టం చేసిన చైనా

ఏకే-47 మెషిన్ గన్ పోస్టర్లు, కిర్పాన్‌లతో కూడిన ప్రచార చిత్రాలు ఉండటంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారని చెబుతూ అనుమతి రద్దు చేసినట్లు కెనడా అధికారులు వెల్లడించారు. చాలా సార్లు ఈ పోస్టర్లను తీసేయాలని చెప్పినప్పటికీ నిర్వాహకులు వీటిని తీసేయకపోవడంతోనే అనుమతి నిరాకరించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా , ఇండియా ఫౌండేషన్ అధ్యక్షుడు మణిందర్ గిల్ స్వాగతించారు.

ఏకే-47 పోస్టర్లే కాకుండా జూన్ 23, 1985న 329 మంది ప్రయాణికులను బలిగొన్న ఎయిరిండియా ఫ్లైట్ 182 కనిష్కపై ఉగ్రవాద దాడిలో కీలకంగా ఉన్న తల్వీందర్ సింగ్ పోస్టర్లను కూడా అంటించారు. అయితే ఈ రెఫరెండం క్యాన్సిల్ కావడంతో కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించలేదు. సిక్కు వేర్పాటువాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సెప్టెంబర్ 8న వాంకోవర్ లోని ఇండియన్ కాన్సులేట్ ‘లాక్ డౌన్’కి ఖలిస్తాన్ మద్దతుదారులకు పిలుపునిచ్చాడు.

Show comments