Noida Twin Towers: గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్ల కూల్చివేతకు ముందు, నిర్మాణాన్ని కూల్చివేసే పనిలో ఉన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్‌తో పనిచేస్తున్న ఇంజనీర్లు, సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘అమాంతం నీరు కిందికి దుమికినట్లు భవనాలు కుప్పకూలుతాయి’ అని ఓ ఇంజనీర్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత తేదీ ఇప్పటికే ఖరారైంది. చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి హాని కలగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఈ కూల్చివేత ప్రక్రియను చేపడుతోన్న ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ వెల్లడించింది.
“సమీపంలోని నివాసితులతో వరుస సమావేశాలను నిర్వహించాం. తీసుకుంటున్న భద్రతా చర్యలతో వారు సంతృప్తి చెందారు. సమీపంలోని భవనాలకు దుమ్ము, చెత్త నుండి మూడు పొరల భద్రతను అందించడానికి వలలు, గుడ్డ, కర్టెయిన్‌లను ఏర్పాటు చేశాం. శిథిలాలు పక్కన ఉన్న భవనాలకు నష్టం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పేలుడుకు ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో స్థానికులను ఖాళీ చేయిస్తాం. అలాగే దుమ్ము కూడా మరో ఏడెనిమిది నిమిషాల్లో ఆగిపోతుంది. పేలుడు ప్రారంభం కాగానే ఆ టవర్స్ వివిధ దశల్లో అంతస్తుల వారీగా లోపలికి పడిపోతాయి. శిథిలాల తొలగింపుపై చర్చిస్తున్నాం’ అని ఎడిఫైస్ ఇంజినీరింగ్ భాగస్వామి ఒకరు తెలిపారు. ఈ పేలుడు వల్ల సంభవించే ప్రకంపనల వల్ల సమీపంలోని భవనాలకు ఎటువంటి నష్టం జరగకుండా చుట్టుకొలత వద్ద కందకాలు తవ్వుతున్నట్లు ఆయన తెలిపారు. అదనపు భద్రత కోసం జంట టవర్లు, సమీపంలోని భవనాల మధ్య కంటైనర్లను కూడా ఉంచారు.
Nathuram Godse: నాథూరామ్ గాడ్సే ఫోటోతో తిరంగా యాత్ర..
నోయిడాలో 2009లో సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో బిల్డర్లు నిబంధనలను పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. తాజాగా ఈ కూల్చివేత డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు ఆగస్టు 28కి పొడిగించింది. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్ 4వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చివేయడానికి 3,500 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను వాడుతున్నారు.