Drone squadrons: భారత్-పాకిస్తాన్ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీ్ర్యం చేసేందుకు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’ను మోహరిస్తోంది. మే 7 నుంచి మే 10 మధ్య పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’నిర్వహించింది. దీని తర్వాత పాకిస్తాన్ డ్రోన్లతో భారత్‌పై దాడులు చేయడానికి ప్రయత్నించింది. అయితే, మన సైన్యం విజయవంతంగా ఈ దాడుల్ని తిప్పికొట్టాయి. మనదేశంలో సైనిక, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని 1000కి పైగా డ్రోన్లను పంపింది.
Read Also: Delhi: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం..
ఈ నేపథ్యంలో డ్రోన్ వార్‌ఫేర్‌లో భారత్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు పాకిస్తాన్‌తో పంచుకుంటున్న 3323 కి.మీ సరిహద్దులో డ్రోన్ స్వ్కాడ్రన్లను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి సరిహద్దుల్లో ఉన్న బీఎస్ఎఫ్ అవుట్ పోస్టుల నుంచి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదించబడిన స్వ్కాడ్రన్‌లు నిఘా, హై టార్గెట్ శత్రువుల లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల కోసం కామికేజ్ డ్రోన్లను మోహరించే అవకాశం ఉంది.
ఈ మేరకు బీఎస్ఎఫ్ సిబ్బందికి ఇప్పటికే డ్రోన్ ఆపరేషన్లలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో నిఘా, సరిహద్దు దాటి ఖచ్చితమైన దాడులు చేయడం, డ్రోన్ సమూహ దాడులను ప్రారంభించడం, శత్రువుల డోన్లను ఎంగేజ్ చేయడం, శత్రువుల రాడార్లను నాశనం చేయడం, సిగ్నల్ జామింగ్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ బోర్డర్ అవుట్ పోస్ట్(BOP)లలో డ్రోన్ ఆపరేషన్లలో శిక్షణ పొందిన ఇద్దరు-ముగ్గురు సిబ్బంది ఉంటారని భావిస్తున్నారు. బీఎస్ఎఫ్ చండీగఢ్ బెటాలియన్‌లో ఏర్పాటు చేయనున్న కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ ఉండనున్నట్లు సమాచారం. భారత ప్రభుత్వ అధికారులు అనేక దేశాలు, భారతీయ కంపెనీలో సంప్రదింపులు జరుపుతున్నారని, అందుబాటులో ఉన్న ఆప్షన్లను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.