ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి అయ్యి కేవలం 20 నిమిషాల్లోనే అత్తగారింటికి చేరుకున్న వధువు… తనకు విడాకులు కావాలని ప్రకటించింది. మొదట ఇది సరదాగా చేసిన వ్యాఖ్య అనుకుని, అక్కడున్నవాళ్లు నవ్వేశారు. కానీ వధువు మాటల్లో సీరియస్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. చివరకు పెద్దల సమక్షంలోనే విడాకులు కూడా జరిగిపోయాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… డియోరియా జిల్లా భలౌని ప్రాంతానికి చెందిన విశాల్ మధేసియా, సాలెంపూర్కు చెందిన పూజతో నవంబర్ 25న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత పూజను ఆచారప్రకారం అత్తగారింటికి తీసుకెళ్లారు. అక్కడ వరుడు–వధువులను విశ్రాంతి కోసం ఒక గదిలోకి పంపించారు.అయితే 20 నిమిషాల తర్వాత పూజ బయటకు వచ్చి “నాకు విడాకులు కావాలి” అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆమెను మొదట వరుడు విశాల్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. తరువాత రెండు కుటుంబాల పెద్దలు కూడా మాట్లాడి ఒప్పించాలని చూశారు. కానీ పూజ తన నిర్ణయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
తదుపరి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అనేక చర్చల తర్వాత ఇరువురు విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. వెంటనే విడాకుల పత్రాలపై సంతకాలు కూడా చేశారు.అయితే వధువు విడాకులు ఎందుకు కోరిందో మాత్రం ఎవరికి చెప్పలేదు. ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చగా మారింది.