కొవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్, బిల్‌గేట్ ఫౌండేషన్‌పై వెయ్యి కోట్ల దావా చేశారు ఔరంగాబాద్‌కు చెందిన దిలీప్ లునావత్. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా తన కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బాంబే హైకోర్టు సీరం సంస్థతో పాటు బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అటు కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు 100 మిలియన్ వ్యాక్సిన్ డోసుల సరఫరా కోసం సీరం ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యమైంది బిల్‌గేట్స్ ఫౌండేషన్.
Read Also: Matrimonial fraud: మాట్రిమోనీలో మాయగాళ్లు.. రెండో పెళ్లికి సిద్ధమైన మహిళలే టార్గెట్..!
మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన దిలీప్ లూనావత్ కుమార్తె స్నేహల్ డెంటిస్ట్. స్నేహల్ గత ఏడాది జనవరి 28న కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. కరోనాపై పోరులో ముందు వరుసలో నిలిచిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు తొలిదశలో ప్రభుత్వం నిర్వహించిన టీకా కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకుంది. ఫిబ్రవరి 3 నుంచి ఆమె అనారోగ్యం బారిన పడింది. చిక్సికు 14 లక్షలు ఖర్చయింది కానీ.. ఉపయోగం లేకపోయింది. మెదడులో రక్తస్రావంతో, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో 2021, మార్చి 1న ఆమె చనిపోయింది. తన కూతురు మృతికి కొవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్టే కారణమంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు దిలీప్. తన కుమార్తె మరణానికి 1000 కోట్ల పరిహారం చెల్లించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు.