యూరోతో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. రూపాయి బలహీనపడడంతో దాని ప్రభావాన్ని తగ్గించేందుకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన వాహనాల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఈ ధరల పెంపు అమల్లోకి రావచ్చని కంపెనీ అధ్యక్షుడు మరియు సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు.
అయితే.. ఫారెక్స్ మార్కెట్లో జరుగుతున్న హెచ్చుతగ్గులు, ప్రపంచ సరఫరా గొలుసులో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా, ఇంతకుముందే ధరలను సుమారు 3 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈసారి ఎంత మేర పెంపు ఉండబోతోందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ దేశీయ మార్కెట్లో రూ. 45.3 లక్షల నుండి రూ. 2.54 కోట్ల వరకు ధరగల ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) విక్రయిస్తోంది.
“ఫారెక్స్లోని మార్పులు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరం యూరోతో పోలిస్తే రూపాయి విలువ ఊహించిన దానికంటే సుమారు 10 శాతం ఎక్కువగా క్షీణించింది. దీని వల్ల కార్ల ధరలు, లాభదాయకతపై గణనీయమైన ఒత్తిడి పడుతోంది,” అని హర్దీప్ సింగ్ తెలిపారు.
వాస్తవానికి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ఉన్నప్పటికీ, ధరలను పెంచేందుకు కంపెనీ మొగ్గుచూపలేదు. అయితే రూపాయి నిరంతరం బలహీనపడటం వల్ల లాభదాయకత దెబ్బతింటోందని, అందువల్ల ధరలు పెంచడం తప్పనిసరిగా మారిందని ఆయన వెల్లడించారు.