BJP: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. 224 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. బీజేపీ 64, జేడీఎస్ 20 స్థానాలకే పరిమితం అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులుగా చేస్తూ హంగ్ అసెంబ్లీకి తావు లేకుండా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నాళ్ల నుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు శక్తినిచ్చింది.
Read Also: Kamal Haasan: కాంగ్రెస్ విజయం, రాహుల్ గాంధీ గురించి కమల్ హాసన్ ఏమన్నారంటే..?
ఇదిలా ఉంటే బీజేపీ ఓడిపోయింది, కానీ బీజేపీకి ఉండే స్ట్రాంగ్ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. 2018 ఎన్నికల్లో ఎంత శాతం ఓట్ షేర్ వచ్చిందో..2023 ఎన్నికల్లో కూడా దాదాపుగా అంతే శాతం ఓట్ షేర్ సాధించింది. గడిచిన రెండు ఎన్నికల్లో 36 శాతం ఓట్ షేర్ సాధించింది బీజేపీ. అయితే సీట్లలో మాత్రం భారీగా కోతపడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36 శాతం ఓట్ షేర్ తో 104 స్థానాలను గెలుచుకుంటే.. ప్రస్తుతం అదే 36 శాతంతో కేవలం 64 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 2018లో కాంగ్రెస్ 38 శాతం ఓట్ షేర్ తో 80 స్థానాలు సాధిస్తే.. 2023లో 43 శాతం ఓట్ షేర్ తో ఏకంగా 136 స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా జేడీఎస్ ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో 18 శాతంతో 37 స్థానాలను జేడీఎస్ గెలుచుకుంటే.. ఈసారి 13 శాతం ఓట్ షేర్ తో 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. దీన్ని బట్టి చూస్తే జేడీఎస్ పార్టీ ఓట్ షేర్ కు కాంగ్రెస్ గండికొట్టింది.