NTV Telugu Site icon

BJP: రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్‌ఫూ నేర్చుకున్నారా..? బీజేపీ ఎంపీలపై దాడిపై పోలీస్ కేసు..

Rijiju

Rijiju

BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.

గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలైన ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టడంతో వారు గాయపడ్డారు. సారంగికి తలకు గాయమైంది. ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారమైన మకర్ దావర్ వద్ద ఈ ఘటన జరిగింది. సారంగిపైకి రాహుల్ గాంధీ ఒక వ్యక్తి నెట్టడంతో ఆయన మెట్లపై పడిపోయారు. ఈ వ్యవహారం మొత్తం పెద్ద వివాదంగా మారింది.

Read Also: Congress: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ కామెంట్స్ ఎడిట్.. కాంగ్రెస్ నేతలకు ‘ఎక్స్’ నోటీసులు..

బీజేపీ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో ఎలా బలప్రయోగం చేయగలడు..? ఇతర ఎంపీలపై భౌతికంగా దాడి చేసే అధికారం ఏ చట్ట ప్రకారం రాహుల్ గాంధీకి ఉంది..? అని రిజిజు ప్రశ్నించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్‌లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘‘మీరు ఇతర ఎంపీలపై దాడి చేయడానికి కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా..? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కుస్తీకి వేదిక కాదు, ఇద్దరు ఎంపీలు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ గాయపడిన ఎంపీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై సారంగి, రాజ్‌పుత్‌లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై బీజేపీ రాహుల్ గాంధీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నేను పార్లమెంట్‌కి రాకుండా బీజేపీ ఎంపీల గుంపు అడ్డుకుందని, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని తోసేస్తున్నారు. ఇది ఘర్షణకు కారణమైంది. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేసి బెదిరించారు.’’ అని చెప్పారు.

Show comments