Rajasthan: రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత జ్ఞాన్‌దేవ్ అహుజాను పార్టీ నుండి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల అల్వార్‌లోని ఒక ఆలయాన్ని కాంగ్రెస్‌కి చెందిన దళిత ఎమ్మెల్యే సందర్శించారు. దీని తర్వాత, అహుజా గంగా జలంలో ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత టికారం జుల్లీ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత అహుజా ఈ చర్యకు పాల్పడ్డాడు. దళిత ఓటర్లు కీలక పాత్ర పోషించే తూర్పు రాజస్థాన్‌లో అహుజా ఈ కార్యక్రమానికి పాల్పడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర బీజేపీ యూనిట్ అతడికి నోటీసులు పంపింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఒక వేళ విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. ‘‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నప్పుడు మీరు కులం, లింగం, మతం ఆధారంగా వివక్ష చూపనని ప్రమాణం చేశారు. కానీ టికారం జుల్లీ సందర్శనను నిరసిస్తూ గంగజలం చల్లారు. మీ చర్య వల్ల పార్టీ ప్రతిష్ఠ దిగజారింది. ఇది క్రమశిక్షణా రాహిత్యం.’’ అని బీజేపీ తన నోటీసుల్లో పేర్కొంది.
Read Also: LSG Vs KKR: కేకేఆర్ ఈడెన్లో విజయం పరంపర కొనసాగిస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎల్ఎస్జి
రాజస్థాన్‌లోని అల్వార్‌లోని ఒక ఆలయం ఆదివారం రామనవమి నాడు కార్యక్రమం జరిగింది. దీనికి రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత టికారం జుల్లీ హాజరయ్యారు. దళితుడైన టికారం జుల్లీ హాజరుకావడంతో ఆలయం అపవిత్రమైందని, తర్వాత రోజు గంగా జలంతో అహుజా ఆలయాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో, కాంగ్రెస్ బీజేపీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేసింది. దేవుళ్లు బీజేపీ నాయకులకే చెందుతారా..? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
2013 నుండి 2018 వరకు రామ్‌గఢ్ ఎమ్మెల్యేగా పనిచేసిన జ్ఞాన్‌దేవ్ అహుజా వివాదాలకు కొత్తేమీ కాదు. 2016లో JNUలో జరిగిన “జాతి వ్యతిరేక” నినాదాల వివాదంలో ఆయన తొలిసారిగా వార్తల్లో నిలిచారు. JNU క్యాంపస్‌లో ప్రతిరోజూ 3,000 కండోమ్‌లు, 2,000 మద్యం సీసాలు దొరుకుతాయని ఆయన ఆరోపించడం సంచలనమైంది. 2017లో గోరక్షకులు పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును హత్య చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు.