parliamentary party board, No place for Yogi, Nitin Gadkari: బీజేపీ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది. దీంతో బీజేపీలో అత్యన్నత నిర్ణయాధికార కమిటీ అయిన కేంద్ర పార్లమెంటరీ బోర్డును ప్రకటించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా… ప్రధాని నరేంద్రమోదీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, లోక్‌సభ మాజీ ఎంపీ సత్యన్నారాయణ, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్, జాతీయ కార్యదర్శి సుధా యాదవ్‌లకు పార్టీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు.
దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీని కూడా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 15మందితో కూడిన ఈ కమిటీకి జేపీ నడ్డా చైర్మన్ గా వ్యవహరిస్తుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలతో పాటు యడ్యూరప్ప, సర్బానంద సోలోవాల్, కే. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్, సత్యనారాయణ. భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథూర్, బీఎల్ సంతోష్, వసతి శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు.
Read Also: Tarun Chugh: మునుగోడులో 21న బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న అమిత్ షా
అయితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లకు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో వీరిద్దరు శివరాజ్ సింగ్, నితిన్ గడ్కరీ పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. కర్ణాటక బీజేపీలో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి అని యడ్యూరప్పకు రెండు కమిటీల్లోనూ చోటు దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను తప్పించినప్పటి నుంచి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రెండు కమిటీల్లో చోటు దక్కిందనే వాదనలు ఉన్నాయి. కొత్తగా మైనారిటీ వర్గం నుంచి ఇక్బాల్ సింగ్ లాల్ పురాకు రెండు కమిటీల్లోనూ చోటుదక్కింది. గతంలో పార్లమెంటరీ బోర్డులో లేని రాజ్ నాథ్ సింగ్ రీఎంట్రీ ఇచ్చారు.