TVK vs BJP: విజయ్ దళపతి పార్టీని ఎన్డీయేలోకి బలవంతంగా చేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే అతడు నటించిన ‘జన నాయగన్’ సినిమాకి సకాలంలో సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రతిపక్షాలు తీవ్ర స్తాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పొత్తుపై తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ రియాక్ట్ అయింది. రాజకీయంగా తమను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని (BJP Alliance) టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. టీవీకేను కూల్చడానికి ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ సిద్ధాంత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. టీవీకేకు బీజేపీ సిద్ధాంత శత్రువు అయితే డీఎంకే రాజకీయ శత్రువని పేర్కొన్నారు.
ఇక, ‘జన నాయగన్’ సినిమా వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందనను స్వాగతిస్తున్నట్లు టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తెలిపారు. దీనిని తమ పార్టీకి కాంగ్రెస్ ఇస్తున్న స్నేహపూర్వక సపోర్టుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆ పార్టీతో పొత్తు విషయంపై తమ పార్టీ అధినేత విజయ్ (Vijay) మాత్రమే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట దుర్ఘటన వ్యవహారం (Karur Stampede)లోనూ విజయ్‌కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేయడంతో.. అతడ్ని ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించాలని బీజేపీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.