Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండు రోజు తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు తనను నిజాయితీపరుడని తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ ఎద్దేవా చేస్తున్నాయి. రెండు రోజుల తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడే చేయొచ్చు కదా.. అంటూ సెటైర్లు వేస్తున్నాయి.
కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ స్పందించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు అవినీతి లేని నాయకుడి నుంచి అవినీతితో సంబంధం ఉన్న నాయకుడిగా మారారని గుర్తించారు. ఆప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అవినీతి పార్టీగా కనిపిస్తోందని చెప్పారు. తన చెడిపోయిన ఇమేజ్‌ని పునరుద్ధరించే చర్యల్లో భాగమని భండారీ అన్నారు. కేజ్రీవాల్ ‘‘సోనియా గాంధీ’’ మోడల్ అనుసరిస్తున్నారని, రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతుందని భయపడుతుందని, మరొకరిని బలిపశువు చేసిన నిందలు మోపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
READ ALSO: Delhi CM : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ?
మరో బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ త్యాగం చేస్తున్నట్లు పదవి విరమణ చేయడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదని, ఫైళ్లపై సంతకాలు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. కేజ్రీవాల్‌కి రాజీనామా చేయడం తప్పా వేరే మార్గం లేదని ఆయన అన్నారు. ఆప్ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను ఓడిపోయినప్పుడే, ఢిల్లీ ఓటర్లు తమ తీర్పును వెల్లడించారని చెప్పారు. తన భార్యని తదుపరి సీఎంగా చేయాలని ఎమ్మెల్యేలను ఒప్పించేందుకే కేజ్రీవాల్ రెండు రోజుల వ్యవధి తీసుకున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ రాజీనామాపై వ్యంగ్యంగా స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. అది కేవలం ‘‘జిమ్మిక్’’ అని కొట్టిపారేశారు. కేజ్రీవాల్ చాలా రోజుల క్రితమే రాజీనామా చేయాల్సిందని అన్నారు. ఆయన మళ్లీ సీఎం అయ్యే ప్రశ్నే లేదని చెప్పారు. బెయిల్ పై విడుదలైన నాయకుడని, సీఎం విధులకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఇదే తొలిసారని ఆయన విమర్శించారు.