Goa: మద్యపానం, బీచులకు గోవా ఫేమస్. ఈ రాష్ట్రానికి టూరిస్టు వెళ్లేందుకు మద్యం కూడా ఒక కారణం. ఇదిలా ఉంటే గోవాలో మద్యాన్ని నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేంద్ర షెడ్ శాసనసభలో డిమాండ్ చేశారు. అయితే, సహచర బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఆయన డిమాండ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం సభలో షెట్ మాట్లాడుతూ.. ‘‘విక్‌సిత్ భారత్’’, ‘‘విక్‌సిత్ గోవా’’ కోసం గోవాలో మద్యపాన నిషేధం విధించాలి. రాష్ట్రంలో మద్యాన్ని ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు, కానీ ఇక్కడ వాటి అమ్మకాలను నిషేధించాలని కోరారు. రాష్ట్రంలో మద్యపానం కారణంగా రోడ్లపై, పారిశ్రామిక యూనిట్లలో ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నారని అన్నారు.
Read Also: US Beach video: టూరిస్టులపై మిడతల దండు దాడి.. తుఫాన్ మాదిరిగా బీభత్సం
బీజేపీ మహిళా ఎమ్మెల్యే డెలిలా లోబో మాట్లాడుతూ.. ప్రజలు తమ రెస్టారెంట్ వ్యాపారాలను మూసేయాలని షట్ కోరుకుంటున్నారా అని అన్నారు. పర్యాటకులు ఇక్కడికి రావడానికి మద్యం కూడా ఒక కారణం, ఏం చేస్తాం రెస్టారెంట్లను మూసేస్తామా..? అని అడిగారు. గోవాలో మద్యపాన నిషేధం సాధ్యం కాదని ఆప్ ఎమ్మెల్యే క్రూజ్ సిల్వా అన్నారు. ఇక్కడ జరగుతున్న ప్రమాదాలకు గోవా ప్రజల ప్రమేయం లేదని, మద్యం విక్రయాలపై అనేక రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయని, మద్యం నిషేధం ఉపాధిపై ప్రభావం చూపుతుందని అన్నారు. గోవాలో మద్యపాన నిషేధం కాదని పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.