BJP leader Sonali Phogat suspicious death: టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్(43) మరణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల గోవాలో పర్యటిస్తున్న సందర్భంలో ఆమె హఠాన్మరణం చోటు చేసుకుంది. ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె అటాప్సీ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంపై కొన్నిమొద్దుబారిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె సహాయకులుగా ఉన్న సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ వాసిపై పోలీసులు అభియోగాలు మోపారు. వీరిద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. అయితే శవపరీక్షలో ఆమె శరీరంపై పదునైన గాయాలేవి లేవని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
సోనాలి ఫోగట్ గోవా పర్యటనలో ఉన్న సమయంలో మంగళవారం గుండె పోటులో అంజునాలోని సెయింట్ ఆంథోని ఆస్పత్రిలో మరణించారు. అయితే ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సోనాలి మరణానికి ముందు తన తల్లి, సోదరుడు, సోదరి, బావతో మాట్లాడిందని.. ఆందోళనలో ఉందని.. తన సహాయకులపై అనుమానాలు వ్యక్తం చేసిందని.. సోనాలి సోదరుడు రింకూ ధాకా వెల్లడించారు. తన సోదరి సహాయకులుగా ఉన్నవారే హత్య చేశారని రింకూ ఆరోపించారు. తన తల్లి మరణంపై విచారణ చేయాలని, న్యాయం చేయాలని ఆమె 15 ఏళ్ల కూతురు యశోధర కోరారు. సోనాలి ఫోగట్ భర్త సంజయ్ ఫోగాట్ 2016లో మరణించారు.
టిక్ టాక్ స్టార్ గా ప్రసిద్ధి చెందిన సోనాలి ఫోగట్ 2019లో బీజేపీలో చేరింది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయింది. ఆదంపూర్ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఆమె బిష్ణోయ్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం బిష్ణోయ్ బీజేపీ పార్టీలో ఉన్నారు. హిందీ బిగ్ బాస్ 14 సీజన్ లో కూడా ఆమె పాల్గోంది.