West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నాయకుడి మరణం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య మంటలు రేకెత్తించింది. తమ పార్టీ నాయకుడిని తృణమూల్ కాంగ్రెస్ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని టీఎంసీ తోసిపుచ్చింది. మొయినా బిజెపి బూత్ ప్రెసిడెంట్ బిజయ్‌కృష్ణ భునియా సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా అతని భార్య ముందే టీఎంసీ గుండాలు కొట్టారని, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారని బీజేపీ ఆరోపించింది.
Read Also: Rajinikanth Fans: రజనీకాంత్ ఫ్యాన్స్ భేటీ.. మంత్రి రోజాకు సీరియస్ వార్నింగ్..
టీఎంసీ 2021 మే 2 అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ లో హింస చెలరేగింది, ఇప్పుడు ఆ పార్టీ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని, బీజేపీ నాయకుడు బిజయ్ కృష్ణ భునియా హత్య ఈ వార్షికోత్సవానికి రాష్ట్ర ప్రజలకు ఒక బహుమతి అని బీజేపే నేత సువేందు అధికారి అన్నారు. మొయినా ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో బీజేపీ తరుపున అశోక్ దిండా ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ కార్యకర్త హత్యకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సంఘటపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
బీజేపీ ఆరోపణలపై టీఎంసీ స్పందించింది. బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని తెలిపింది. అతని మరణానికి కుటుంబ కలహాలే కారణం అని టీఎంసీ చెబుతోంది. చనిపోయిన భునియా మృతదేహాం అతని ఇంటికి కొంతదూరంలో కనుగొన్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు మేదినీపూర్ ఎంపి, దిలీప్ ఘోష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఎంసీ ఇలాంటి హింసాత్మక సంఘటనలకు దిగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఆరోపించారు.