పార్లమెంట్‌లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. అయితే క్రమంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య క్షీణిస్తూ వస్తోంది.
మరోవైపు బీజేపీ మాత్రం క్రమంగా పెద్దల సభలో తమ ఆధిక్యం పెంచుకుంటూ వస్తోంది. నరేంద్ర మోదీ అధికారం చేపట్టే నాటికి రాజ్యసభలో బీజేపీ బలం 55 మంది సభ్యులే. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 100కి చేరింది. తాజాగా అసోం, నాగాలాండ్, త్రిపురలో నెగ్గిన మూడు సీట్లతో బీజేపీ బలం పుంజుకుంది. భవిష్యత్‌లో రాజ్యసభలో బీజేపీ బలం ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 11 స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో 8 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వచ్చే అవకాశముంది.
అటు ఏపీలో రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, విజయసాయిరెడ్డి పదవీకాలం త్వరలో ముగియనుంది. సుజనాచౌదరి టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్లగా.. విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అయితే విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉండగా.. బీజేపీలోకి వెళ్లిన సుజనాకు మాత్రం ఆ అవకాశం లేదు.
https://ntvtelugu.com/bharat-biotech-slows-down-covaxin-vaccine-production/