Karnataka: కర్ణాటకలోని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం స్పీకర్ యూటీ ఖాదర్‌ను గౌరవంగా పలకరించేలా చేశామని, ఇప్పుడు బీజేపీ నేతలు కూడా ఆయన్ను గౌరవంగా పలకరించడం తప్పదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘటత అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘ ఈరోజు బీజేపీ లేచి నిలబడి మా యూటీ ఖాదర్‌కి ‘నమస్కారం సార్’ అని చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఘనత’’ అని తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో జమీర్ ఖాన్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ముస్లిం నాయకుల కీలక స్థానాల్లో ఉన్నారని మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. గత ఎన్నికల్లో 17 మంది ముస్లిం అభ్యర్థుల్లో 9 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, 5 మంది కీలక పొజిషన్లలో ఉన్నారని తెలిపారు. తనతో పాటు రహీమ్ ఖాన్ మంత్రిగా ఉండగా.. సలీమ్ అహ్మద్ ఖాన్ చీఫ్ విప్‌గా, నసీర్ అహ్మద్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారని వెల్లడించారు.
Read Also: Revanth Reddy: మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వ హమాంలో ఇంతకుముందు ముస్లిం స్పీకర్ లేరని, ఇప్పుడు స్పీకర్ యూటీ ఖాదర్‌ని బీజేపీ గౌరవంగా గుర్తించాలని సూచించారు. డిసెంబర్ 4 నుంచి 15 వరకు బెలగావిలోని సువర్ణ సౌధలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు..మంత్రి జమీర్ అహ్మద్ ఇంత నీచస్థాయికి వస్తారని నేను ఊహించలేదు, ఈ ప్రకటన వల్ల అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ లేచి నిలబడకూడదని నిర్ణయించుకుంటే.. అప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంటుంది..? ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే జమీర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూలై నెలలో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ యూటీ ఖాదర్ సస్పెండ్ చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానిపై బిల్లులను చింపి విసిరేసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల చర్యలపై స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.