Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు బీజేపీ పెద్దలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశం కానున్నట్లు సమాచారం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవ్య, ఇతర నేతలు కూడా నడ్డా నివాసానికి రానున్నారు.
Read Also: Amul vs Nandini: కర్ణాటకలో “పాల వివాదం”..నందిని మిల్క్‌కు సపోర్టుగా బెంగళూర్ హోటల్స్..
మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను బీజేపీ షార్ట్ లిస్ట్ చేసిందని, వాటిని కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 4న కర్ణాటక బీజేపీ కోర్ గ్రూప్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, కో ఇంచార్జ్ మన్సుఖ్ మాండవీయ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు అన్నామలై కలిసి అభ్యర్థుల షార్ట్ లిస్టును పంపారు. మాజీ ముఖ్యమంత్రి ఎడియూరప్పతో పాటు సీఎ బస్వరాజ్ బొమ్మై కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 80, జేడీయూ 37 స్థానాలను గెలుచుకుంది. కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలను వెల్లడించనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా తన 166 అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరో పార్టీ జేడీయూ కూడా 93 అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది. అయితే జేడీయూ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.