Site icon NTV Telugu

West Bengal: బైపోల్‌లో టీఎంసీ విజయం.. రక్తపాతం సృష్టించి గెలిచారంటూ బీజేపీ విమర్శలు

Tmcbjp

Tmcbjp

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో బైపోల్స్ జరిగాయి. గుజరాత్‌లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ, ఇంకొకటి ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కేరళలో కాంగ్రెస్ గెలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్ సీటును అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ సందర్భంగా కలిగంజ్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్

అయితే బైపోల్‌లో టీఎంసీ విజయంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పశ్చిమ బెంగాల్ యూనిట్‌ సహ-ఇన్‌ఛార్జ్‌ అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. రక్తం చిందించకుండా టీఎంసీ ఉప ఎన్నికలో కూడా గెలవదంటూ ట్వీట్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో బాంబు పేలుడికి పదేళ్ల బాలిక మరణించిందని.. టీఎంసీ వేడుకలు రక్తంతో ముగుస్తాయని మాల్వియా ట్వీట్‌లో పేర్కొన్నారు. 4వ తరగతి విద్యార్థిని తమన్నా ఖాతున్ అనే చిన్న అమ్మాయి చనిపోయిందని తెలిపారు. టీఎంసీ అసలు రాజకీయ పార్టీ కాదని.. అది రాబందుల ముఠాగా అభివర్ణించారు. రక్తం చిందించకుండా గెలవలేదని తెలిపారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా ఉప ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితా? మమతా బెనర్జీ పాలనలో విజయానికి చెల్లించే ధర ఇదేనా? అంటూ మాల్వియా విమర్శించారు.

ఇది కూడా చదవండి: YS Jagan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? చంద్రబాబుకు జగన్‌ ఛాలెంజ్..

ఇక బాలిక మరణం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విచారం వ్యక్తం చేశారు. తీవ్ర విచారానికి గురైనట్లు పేర్కొన్నారు. దు:ఖ సమయంలో మా ప్రార్థనలు, ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయని పేర్కొన్నారు.

కేరళలోని నిలంబూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యదాన్ షౌకత్‌ను ప్రియాంక అభినందించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు నిలంబూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతో ఆర్యదాన్ షౌకత్‌… పార్టీని ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక గుజరాత్‌లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. ఇక పంజాబ్‌లో కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు సంతోషకరమైన విషయంగా తెలిపారు.

Exit mobile version