Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు

Bihar Police Exam Chaos

Bihar Police Exam Chaos

బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం పాట్లీపుత్ర రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు అభ్యర్థులు రైల్వే పట్టాలపైకి దిగి రైళ్లను అడ్డుకోవడంతో పాటు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులు గాయపడినట్లు సమాచారం.

ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించాల్సి ఉండటంతో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభ్యర్థులు రాత్రికి రాత్రే పాట్లీపుత్ర స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే తగినన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులో లేకపోవడం, కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవడంతో తాము పరీక్షకు సమయానికి చేరుకోలేమనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.

×
×
Ad

ప్రత్యేక రైలు రాకతో ఉద్రిక్తత

పాట్లీపుత్ర నుంచి కతిహార్‌కు వెళ్లాల్సిన పరీక్షల ప్రత్యేక రైలు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన అభ్యర్థులు రైలు ముందు పట్టాలపై కూర్చుని రైల్వే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు రైలు రాకపోకలు స్తంభించిపోయాయి.

రాళ్ల దాడి.. రైలు ధ్వంసం

ఆందోళన కొనసాగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసరడంతో పాటు రైలు బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పలు పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని నియంత్రణలోకి తీసుకువచ్చారు.

ఐజీ సహా పలువురు పోలీసులకు గాయాలు

ఈ హింసాత్మక ఘటనలో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) జితేంద్ర రాణా, రూపస్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బంది స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం. దీంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఐజీ జితేంద్ర రాణా, దానాపూర్ ఎస్పీ, ఎస్డీఎం, ఏఎస్పీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలోనే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, అభ్యర్థులను శాంతింపజేసేందుకు పోలీసులు, రైల్వే అధికారులు సంయుక్తంగా ప్రయత్నాలు చేపట్టారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకుని అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.