బీహార్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సామ్రాట్‌తో పాటు జేడీయూకు చెందిన ఇద్దరు విజయ్ కుమార్, బిజేంద్ర యాదవ్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.
తాజాగా ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి శాఖలను కేటాయించారు. కీలక శాఖ హోంశాఖతో 29 పోర్ట్‌ఫోలియోలను సామ్రాట్ తన దగ్గర ఉంచుకోగా.. 18 శాఖలను జేడీయూకు కేటాయించారు. ప్రస్తుతం ముగ్గురితో ప్రభుత్వం ఏర్పాటైంది. సమ్రాట్ చౌదరి హోం, ఆరోగ్యం, చట్టం, పరిశ్రమ, పర్యాటకం, పర్యావరణంతో సహా మొత్తం 29 శాఖలను నిర్వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరికి జలవనరులు, విద్య, గ్రామీణాభివృద్ధి సహా పది శాఖల బాధ్యతలను అప్పగించారు. రెండవ ఉప ముఖ్యమంత్రి బిజేంద్ర యాదవ్‌కు ఇంధనం, ఆర్థికం, వాణిజ్యం, సాంఘిక సంక్షేమం, ఆహారం, గ్రామీణ పనులు వంటి 8 శాఖల బాధ్యతలను అప్పగించారు.
ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిశాక బీహార్ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. అప్పటి వరకు ముగ్గురితోనే ప్రభుత్వం నడవనుంది. ఇక సామ్రాట్ చౌదరి తన రాజకీయ జీవితాన్ని ఆర్జేడీతో ప్రారంభించారు. సామ్రాట్ చౌదరి 2018లో బీజేపీలో చేరారు. 2023 మార్చిలో సమ్రాట్ చౌదరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 2024 జనవరిలో నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు.
