Site icon NTV Telugu

Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌‌పై తీవ్ర దుమారం

Bjp

Bjp

ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీహార్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ఎన్నికల సంఘం లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర యుద్ధమే చేసింది. అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ పెట్టిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది. కొన్నింటినీ తగ్గించింది. లగ్జరీ వాటిపై పెంచింది. తాజాగా ఇదే అంశాన్ని కోడ్ చేస్తూ కేరళ కాంగ్రెస్ ఒక పోస్ట్ పెట్టింది. బీడీ, బీహార్.. రెండు కూడా ‘బీ’తోనే ప్రారంభమవుతాయని.. ఇకపై వాటిని పాపంగా పరిగణించలేమంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. సిగరెట్లు, బీడీలు, పొగాకుపై సవరించిన జీఎస్టీ రేట్ల వివరాలను పంచుకుంటూ రాసింది. వెంటనే పోస్ట్‌ను కూడా తొలగించింది. కానీ అంతలోనే జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!

కాంగ్రెస్ పోస్ట్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ప్రధాని మోడీ తల్లిని విమర్శించారని.. ఇప్పుడు ఏకంగా బీహార్ ప్రజలందరినీ అవమానించారని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ హద్దులు దాటిందని వ్యాఖ్యానించారు. తొలగించిన కాంగ్రెస్ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు. మోడీ తల్లిని తిట్టిన తర్వాత.. ఇప్పుడు బీహార్‌ను అవమానించిన కాంగ్రెస్‌ను తేజస్వి యాదవ్ సమర్థిస్తారా? అని అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర నుంచి డీఎంకే వరకు బీహార్‌పై ద్వేషం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్‌లో పెట్టుబడులు ఆపండి.. వైట్‌హౌస్ విందులో ఆపిల్ సీఈవోకు ట్రంప్ సూచన

ఇక జనతాదళ్ యునైటెడ్ నాయకుడు సంజయ్ కుమార్ ఝా కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. మరో సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. ‘‘B అంటే బీడీ మాత్రమే కాదని, బుద్ధి (తెలివి) అని కూడా నేను మీకు చెప్తాను. అది మీకు లేదు. B అంటే బడ్జెట్ కూడా, బీహార్ ప్రత్యేక సహాయం పొందినప్పుడు ఇది మిమ్మల్ని అసూయపడేలా చేస్తుంది.’’ అని హిందీలో రాశారు. బీహార్‌ను అపహాస్యం చేయడం ద్వారా కాంగ్రెస్ మరోసారి బీహార్ ప్రజలను అవమానించడమే కాకుండా దేశ అద్భుతమైన చరిత్ర, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఝా అన్నారు.

సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన కొత్త రేట్ల ప్రకారం.. బీడీలపై గతంలో విధించిన 28 శాతం పన్నుకు బదులుగా ఇప్పుడు 18 శాతం పన్ను తగ్గించారు.

 

Exit mobile version