దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. దర్యాప్తు అధికారులపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యల అమలుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఢిల్లీ లిక్కర్ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన చర్య తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు సోమవారం స్టే విధించింది.
మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, మరో 20 మందిని ఫిబ్రవరి 27న నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ విచారించారు. అప్పీల్‌ను నిర్ణయించే వరకు ఈడీ కేసులో విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును కోరింది. విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
సీబీఐ తరపున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దేశ రాజధానిలో జరిగిన అత్యంత పెద్ద స్కామ్‌ల్లో ఒకటి అని తెలిపారు. కేసులో శాస్త్రీయంగా, సాక్ష్యాలతో కూడిన విచారణ జరిగిందని వివరించారు. ‘‘హవాలా మార్గంలో డబ్బు చేతులు మారాయని.. రూ.100 కోట్ల వరకు ముడుపులు కూడా అందాయి. రూ.44.5 కోట్లు హవాలా ద్వారా బదిలీ అయ్యాయని సీబీఐ దర్యాప్తులో బయటపడింది. ఆ డబ్బంతా గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. ఈ కేసులో 164 స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. కుట్ర ఎలా జరిగింది?, ఎవరికి లంచం ఇచ్చారు అనే విషయాలు సాక్షులు వివరించారు. విజయ్ నాయర్ ముడుపుల వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడు. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఆర్డర్ ట్రయల్ లేకుండానే ఇచ్చిన అక్విటల్ లాంటిది. డిశ్చార్జ్ దశలో సాక్ష్యాలకు పూర్తి నిర్ధారణ అవసరం లేదని, అయినా కోర్టు తప్పుగా అంచనా వేసింది. దర్యాప్తులో సేకరించిన ఈమెయిల్స్, వాట్సాప్ చాట్స్ వంటి ఆధారాలు ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. 170 మొబైల్ ఫోన్లు నాశనం చేశారు.’’ అని తుషార్ మెహతా వాదనలు వినిపించారు.