West Bengal: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరబోతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను మించి ఈ ఎన్నికలు ఆ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు కీలకం కాబోతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఆ రాష్ట్రంలో ఈ ఎన్నికలు తీవ్ర హింసకు దారి తీశాయి. పరస్పరం వివిధ పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకోవడంతో పాటు హత్యలు జరిగాయి. తొలిసారిగా రాజ్ భవన్ ఎన్నికల్లో కలుగజేసుకుంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తన అధికారికి నివాసంలో ‘పీస్ హోమ్’ని ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు టీఎంసీ, బీజేపీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామాలను తన గుప్పిట ఉంచుకునేందుకు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని అనుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీలు పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
Read Also: PM Modi Tour: మోడీ పర్యటనపై సీపీ రంగనాథ్.. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశాం
మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు 5.67 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. జూన్ 8న ఎన్నికలు ప్రకటించిన రోజు నుంచి బెంగాల్ అంతట పెద్ద ఎత్తున హింస చెలరేగింది. మొత్తం 12 మందికి పైగా దాడుల్లో మరణించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి బీజేపీ తరుపున తీవ్రంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరుపున ఆ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, సీపీఎం తరుపున మహ్మద్ సలీం ప్రచారం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో 70 దశకంలో పంచాయతీలు ప్రారంభమైతే, రెండోసారి రాష్ట్రంలో కేంద్ర బలగాల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి.