NTV Telugu Site icon

Afghanistan: ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర.. ఏం చేసిందంటే..

Cricket

Cricket

Afghanistan: ప్రపంచ క్రికెట్‌లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది. ఆఫ్ఘాన్ ధాటికి ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. టీ 20 వరల్డ్ కప్‌లో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో పాటు సెమీస్‌కి దూసుకెళ్లింది.

అయితే, క్రికెట్ ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ ఆఫ్ఘాన్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పాటునందించింది. ఇండియాలోని గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ ఫాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదటిసారిగా 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కి ‘‘హోమ్ గ్రౌండ్’’గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ తన స్థావరాన్ని షార్జా నుంచి నోయిడాకు మార్చింది. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.నోయిడా మాత్రమే కాదు డెహ్రాడూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరస్‌కి ఆతిథ్యం ఇచ్చింది.

Read Also: Indians In Kenya: “కెన్యాలోని భారతీయులు జాగ్రత్త”.. హింస నేపథ్యంలో కేంద్రం కీలక సూచన..

బీసీసీఐ ఆఫ్ఘాన్‌కి సౌకర్యాలు కల్పించడమే కాదు, భారత మాజీ క్రికెటర్లు కోచింగ్ కూడా సహకరించింది. లాల్‌చంద్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజాలు గతంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. వన్డే ప్రపంచకప్-2023 వరకు జడేజా ఆ టీం మెంటర్‌గా ఉన్నారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు అయిన BCCI, రెండు దేశాలు మరియు జట్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక పెద్ద ముందడుగు వేసి, బెంగళూరులో జట్టు తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు అప్పటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కూడా ఆహ్వానించింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు క్రికెట్ ఒక వారధిగా మారింది.

ఇదిలా ఉంటే, ఐపీఎల్ కూడా ఆఫ్ఘాన్ క్రికెటర్లు రాటుదేలేందుకు సహకరించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌తో సహా పలువురు ఆటగాళ్లు ఐపీఎల్‌లోని పలు టీముల్లో ఆడుతున్నారు. దీంతో వారికి ఇంటర్నేషనల్ ప్లేయర్లతో ఆడే వెసులుబాటు కలగడంతో పాటు క్రికెట్ మెలకువలు తెలుసుకున్నారు.