Top 10 richest temples: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవ వేడుక జరగబోతోంది. దాదాపుగా రూ.1800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది విరాళాలు ఇచ్చారు. రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరవుతున్నారు. 7000 మందికి పైగా అతిథులు, లక్షల్లో ప్రజలు హాజరుకానున్నారు.
రామ మందిరానికి వేడుక వేళ భారతదేశంలో 10 అంత్యంత ధనిక దేవాలయాలు ఇవే..
1) తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్

దేశంలోనే అత్యంత ధనిక దేవాలయంగా తిరుపతి దేవస్థానం నెంబర్ వన్ 1 ఉంది. రోజూ 50,000 భక్తులు ఈ ఆలయానికి వస్తారు. రూ. 3 లక్షల కోట్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలయంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2022లో విడుదల చేసిన శ్వేతపత్రాల ప్రకారం తిరుమలలోని లార్డ్ బాలాజీ హుండీ వార్షిక ఆదాయం రూ.1,400 కోట్లు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు వచ్చే విరాళాలతో పాటు ఫిక్డ్స్ డిపాజిట్స్‌పై వడ్డీ ఇలా వందల కోట్లు ఆదాయం వస్తోంది.
2) పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ

కేరళ రాజధాని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం రెండో ధనిక ఆలయంగా ఉంది. రూ. 1,20,000 కోట్ల ఆస్తుల్ని కలిగి ఉంది. సంపదలో బంగారు విగ్రహాలు, బంగారం, పచ్చలు, పురాతన వెండి, వజ్రాలు మరియు ఇత్తడి ఉన్నాయి. 2015లో ఈ దేవాలయంలోని రహస్య గదుల్లో వాల్ట్-బి లో అపారమైన నిధిని కనుగొన్నారు. నాగబంధనం ఉన్న మరోగదిలో దీనికి మించి ఆదాయం ఉందని పలువురు చెబుతుంటారు. అయితే దీనిని తెరవలేదు. ఈ ఆలయం తిరువత్తర్‌లోని ప్రసిద్ధ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం మరియు హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది.
3) గురువాయూర్ దేవస్వోమ్, గురువాయూర్, కేరళ

ఈ పుణ్యక్షేత్రంలో విష్ణువును కృష్ణునిగా పూజిస్తారు, ఇక్కడ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మరియు ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు. 2022లో ఆర్టీఐ నివేదిక ప్రకారం.. ఈ ఆలయానికి రూ. 1,737.04 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు, 271.05 ఎకరాల భూమితో పాటు బంగారం, వెండి, విలువైన రాళ్లు ఉన్నాయి.
4) వైష్ణో దేవి ఆలయం, జమ్మూ

హిమాలయాల్లోని జమ్మూ వైష్ణో ఆలయం ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఉంది. దుర్గాదేవీ 108 శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు. గత రెండు దశాబ్ధాల్లో ఈ దేవాలయానికి విరాళంగా 1800 కిలోల బంగారం, 4700 కిలోల వెండి, రూ. 2000 కోట్లు వచ్చాయి.
5) షిర్డీ సాయి బాబా, మహారాష్ట్ర

దేశంలో ప్రసిద్ధి దేవాలయాల్లో షిర్డీ సాయిబాబా ఆలయం ఒకటి. సాయిబాబాను దర్శించుకునేందుకు ప్రతీ రోజూ 25,000 మంది భక్తులు వస్తుంటారు. ఆలయం 1922లో నిర్మించారు. 2022లో ఈ ఆలయానికి రూ. 400 కోట్ల విరాళాలు అందాయి.
6) గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్

సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణదేవాలయం కూడా ధనిక ఆలయంగా పరిగణించబడుతుంది. ఐదవ సిక్కు గురువు గురు అర్జున్ సాయంతో ఈ మందిరాన్ని నిర్మించారు. సిక్కుల మొదటి గురువు గురునానక్, ఈ ఆలయాన్ని నిర్మించకముందు ఇక్కడే ధ్యానం చేసేవారు. దాదాపు 400 కిలోల బంగారాన్ని ఈ దేవాలయ పై అంతస్తుల తయారీలో ఉపయోగించారు. దీని వార్షిక ఆదాయం రూ. 500 కోట్లు.
7) మీనాక్షి ఆలయం, మదురై

తమిళనాడులో ముఖ్య ఆలయాల్లో మదురై మీనాక్షీ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి రోజూ 20,000 కంటే ఎక్కువ భక్తులు వస్తుంటారు. ప్రతీ ఏడాడి రూ. 60 మిలియన్ల ఆదాయం వస్తుంది.
8) సిద్ధివినాయక దేవాలయం, ముంబై

ముంబైలో అత్యంత ధనిక ఆలయాల్లో సిద్ధివినాయక దేవాలయం ఉంటుంది. రూ. 125 కోట్ల నికర ఆదాయంతో పాటు విరాళాల ద్వారా రోజుకు రూ. 30 లక్షల ఆదాయం వస్తుంటుంది.
9) సోమనాథ్ ఆలయం, గుజరాత్

గుజరాత్‌లో ఉన్న సోమనాథ్ ఆలయం పూర్వకాలంలో ఎంతో సంపదకు నిలయం. భారతదేశంలో పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిది. ఈ ఆలయ సంపద ఎంతన్నది స్పష్టం తెలియనప్పటికీ.. ఆలయంలో 130 కిలోల బంగారం, దాని శిఖరంపై మరో 150 కిలోల బంగారం ఉంటుంది. 1700 ఎకరాల భూమితో సహా చాలా ఆస్తుల్ని కలిగి ఉంది.
10) శ్రీ జగన్నాథ్ పూరి ఆలయం, పూరి, ఒడిశా

ఒడిశాలోని పూరి జగన్నాధ్ ఆలయాన్ని 11వ శతాబ్ధంలో ఇంద్రద్యుమ్న రాజు నిర్మించారు. ఇది హిందువులకు అత్యంత గౌరవప్రదమైన తీర్థయాత్ర మరియు బద్రీనాథ్, ద్వారక మరియు రామేశ్వరంతో కూడిన పవిత్ర చార్ ధామ్ యాత్రలో చేర్చబడింది. నివేదికల ప్రకారం, ఈ ఆలయం నికర విలువ రూ. 150 కోట్లు మరియు జగన్నాథుని పేరుతో రిజిస్టర్ చేయబడిన సుమారు 30,000 ఎకరాల భూమిని కలిగి ఉంది.