కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు.. బెంగుళూరులోని రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించగా.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైతో ప్రమాణం చేయించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రతినిధులతో పాటు మాజీ సీఎం యడ్యూరప్ప, ఇతర నేతలు హాజరయ్యారు. కర్ణాటక 23వ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక, సీఎంలైన తండ్రి-కొడుకుల జాబితాలో చేరిపోయారు బొమ్మై.. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడే ఈ బసవరాజు బొమ్మై. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈయన.. దేవెగౌడ, రామకృష్ణ హెగ్డే, జేహెచ్ పాటిల్ శిష్యుడిగా పేరు గడించారు.
1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొమ్మై… 2008లో కాషాయ తీర్థం పుచుకున్నారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంజినీరింగ్ చదువుకున్న ఆయన టాటా గ్రూప్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి హావేరి జిల్లాలోని షిగ్గాన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయభేరి మోగించారు. ఇప్పుడు కర్ణాటక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 32 సంవత్సరాల క్రితం బసవరాజ్ తండ్రి ఎస్.ఆర్. బొమ్మై కొంతకాలం కర్ణాటక సీఎంగా సేవలందించారు. మళ్లీ ఇన్నాళ్లకు బసవరాజ్ సీఎం కుర్చీ అధిష్టించారు.. బసవరాజ్ కూడా లింగాయత్ వర్గానికి చెందిననేత. బసవరాజు బొమ్మై వయసు 61 ఏళ్లు.. బీఎస్ యడియూరప్ప సర్కార్‌లో హోంమంత్రిగా పనిచేశారు.