NTV Telugu Site icon

Suvendu Adhikari: బీజేపీ నేత సువేందు అధికారిపై దాడికి బంగ్లాదేశ్ టెర్రరిస్టు గ్రూపుల కుట్ర..

Suvendu Adhikari

Suvendu Adhikari

Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్‌లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

దుండగులు గత వారం ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు, పరిసరాల గురించి సర్వే చేసినట్లు, సువేందు అధికారి నివాసాన్ని ఫోటోలు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం..తక్షణ చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులు కోల్‌కతా పోలీసులను, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి Z+ సెక్యూరిటీ ఉన్న ఆయనకు మరింత సెక్యూరిటీ పెంచాలని ఆదేశాలు వచ్చాయి. పండుగ సీజన్‌లో ప్రమాదం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర మరియు స్థానిక పోలీసు బలగాలతో పాటు CISF కూడా తమ నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఐబీ సూచించింది.

Read Also: Arvind Kejriwal: బీజేపీ సీఎం అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఇలాంటి వ్యక్తి ఢిల్లీ సీఎం కావాలా..?

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వంలో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఈ దాడుల్ని సువేందు అధికారి తీవ్రంగా ఖండించారు. హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై ఆయన గళం విప్పారు. బంగ్లా మధ్యంతర ప్రభుత్వాన్ని మిలిటెంట్లతో పోల్చారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ చట్టబద్ధమైన ప్రధాని అని, ఆమెని తొలగించాల్సి వస్తే అది ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారానే జరగాలని ఆయన సూచించారు. యూనస్ ప్రభుత్వం చట్టవిరుద్ధమని చెప్పారు.

అయితే, ఈ ఉగ్రవాద ముప్పుపై అధికారి మాట్లాడుతూ.. తనకు ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లడం లేదని, ప్రజలే తనను కాపాడుతారని సువేందు అధికారి బుధవారం చెప్పారు. గతంలో సీపీఎం, టీఎంసీలు నాపై దాడి చేశాయని, ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేయాలని చూస్తున్నారని, అయితే ఇంతకుముందు తనను కాపాడిన ప్రజలే మళ్లీ కాపాడుతారని అన్నారు.

Show comments