NTV Telugu Site icon

Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..

Badlapur Encounter

Badlapur Encounter

Badlapur encounter: బద్లాపూర్ అత్యాచార నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడిని వాహనంలో తీసుకెళ్తుండగా.. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేష్ మోర్ పిస్టల్ లాక్కుని ఎస్కార్ట్ పోలీసుల నుంచి పారిపోయిందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులకు కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికను లైంగికంగా వేధించిన స్వీపర్ అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ లైంగిక వేధింపుల ఘటన ఆగస్టులో బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర నిరసనకు కారణమైంది. కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో పొలిటికల్ వార్‌కి దారి తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీలు అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఈ ఎన్‌కౌంటర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఘటన జరిగిన స్కూల్ బీజేపీ నాయకుడి యాజమాన్యంలో ఉందనే రుజువల్ని నాశనం చేయడానికి ఈ ఎన్‌కౌంటర్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Read Also: Bengaluru chilling murder: ఫ్రిజ్‌లో, సూట్‌కేసులో 50 ముక్కలుగా మహాలక్ష్మీ శరీరం.. అష్రాఫ్‌పై భర్త అనుమానం..

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి ఎలా కాల్పులు జరిపాడని ప్రశ్నించారు. ఈ ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ రోజు మహారాష్ట్రలో చట్టం అమలు, న్యాయవ్యవస్థ పూర్తిగా విచ్చినమైందని అన్నారు. కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ దీనిని ‘‘మహారాష్ట్ర పోలీసులకు బ్లాక్ డే’’గా అభివర్ణించారు. అది ఎన్‌కౌంటర్ అని ఎవరూ నమ్మరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చవాన్ డిమాండ్ చేశారు. నిందితుడి తల్లిదండ్రులు ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపించారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని షిండే తల్లిదండ్రులు అన్నారు. తన కొడుకు క్రాకర్స్, రోడ్డు దాటడానికి కూడా భయపడుతాడని, అలాంటి వాడు ఎలా పోలీసులపై కాల్పులు జరుపుతాడంటూ ప్రశ్నించారు.

అయితే, ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ, అధికార శివసేన ఘాటుగా స్పందించాయి. అత్యాచార నిందితుడికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై దాడి చేశాడు, అయినా కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, అక్షయ్ షిండేను ఉరితీయాలని ప్రతిపక్షాలే డిమాండ్ చేశాయి, ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నారని శివసేన ఎంపీ నరేష్ మాస్కే అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ప్రతిపక్షాల విమర్శలపై ధ్వజమెత్తాడు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వ లడ్కీ బహిన్ పథకం విజయవంతం కావడంతో భయపడుతున్నాయని అన్నారు.