Atiq Ahmed: అతీక్ అహ్మద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. నిన్న మొన్నటి వరకు కేవలం ఉత్తర్ ప్రదేశ్ నేర సామ్రాజ్యానికే పరిచయం అయిన పేరు కాస్త ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది. గ్యాంగ్ స్టర్ గా, రాజకీయ నేతగా ఎన్నో అరాచకాలు, హత్యలు, నేరాలకు పాల్పడ్డాడు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాకతో అతీక్ నేర సామ్రాజ్యం పేకమేడలా కూలిపోయింది. ఇతడిపై మొత్తం 160కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 2005 రాజుపాల్ హత్య, ఈ నేరంలో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ కిడ్నాప్, హత్య నేరాల్లో జైలులో ఉన్నాడు.
అతీక్ కుటుంబం అంతా నేరస్తులే..
అయితే అతడే కాదు అతని ఫ్యామిలీ మొత్తం నేరచరితులే. భార్య, సోదరుడు, కొడుకు అంతా క్రిమినల్సే. వీరందరిపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తాజాగా ఈ రోజు హతం అయిన అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ పై కూడా కేసులు ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతీక్ అహ్మద్ 1996లో షైస్తా పర్వీన్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు కొడుకులు. ఉమర్, అలీ, అసద్, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. యూపీ పోలీసుల ప్రకారం అతీక్ పై 100, అతడి సోదరుడు అష్రఫ్ పై 52, అతిక్ భార్య షైస్తా పర్వీన్ పై 3, కుమారులు అలీపై 4, ఉమర్ పై ఒక కేసు ఉంది.
షైస్తా పర్వీన్ ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉంది ప్రస్తుతం పరారీలో ఉంది. గతంలో ఆమె మాయావతి పార్టీ బీఎస్పీలో చేరారు. ప్రయాగ్ రాజ్ మేయర్ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రచారం చేసుకుంది. అయితే ఉమేష్ పాల్ హత్య వెలుగులోకి రావడంతో మాయావతి టికెట్ క నో చెప్పింది. ఉమేష్ పాల్ హత్యలో ఈమె ప్రమేయం ఉంది. హత్య అనంతరం షూటర్లను పారిపోవాల్సిందిగా చెప్పింది. యూపీ పోలీసులు ఆమెపై రూ. 25,000 రివార్డును రూ. 50,000లకు పెంచారు.
2018లో లక్నోకు చెందిన మోహిత్ జైస్వాల్ అనే వ్యాపారవేత్తపై దోపిడీ, దాడి మరియు కిడ్నాప్ ఆరోపణలపై అతిక్ పెద్ద కుమారుడు ఉమర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. గత ఏడాది ఆగస్టులో, ఉమర్ సీబీఐ ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం లక్నోలోని జైలులో ఉన్నాడు. అతని మరో కొడుకు అలీపై కూడా హత్యాయత్నం కేసు ఉంది. అసద్ ఉమేష్ పాల్ హత్యలో నిందితుడిగా ఉన్నాడు. తాజా ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు. ఉమేష్ హత్యలో అతీక్ అహ్మద్ ఇద్దరు మైనర్ కుమారులు కూడా పోలీసలు అదుపులో ఉన్నారు.
అతిక్ సోదరుడు అఫ్రఫ్ కు 1992లో నేరచరిత్ర ఉంది. కిడ్నాప్ కేసులు ఇతడిపై నమోదు అయ్యాయి. గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసులు ఉన్నాయి. 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతిక్ తో పాటు మరో ఇద్దరు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అతిక్ కుటుంబానికి చెందిన రూ. 11,684 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం అతడిపై 54 కేసులు విచారణలో ఉన్నాయి. అతిక్, అతని కుటుంబం బలవంతంగా ఆక్రమించిన రూ. 751 కోట్ల ఆస్తులను విడుదల చేసినట్లు ప్రయాగ్ రాజ్ జిల్లా యంత్రాంగం చెబుతోంది.
యోగి మార్క్ చర్యలు:
యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలో మాఫియాను ఏరిపారేస్తున్నారు. ఉంటే జైలులో లేకపోతే నరకానికి పార్సిల్ చేయడమే అన్న రీతిలో పోలీసులు చెలరేగిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాఫియా చుట్టూ ఉచ్చు బిగించడానికి చర్యలు చేపట్టింది, దీని కారణంగా అతిక్ మరియు అతని సహచరులు ప్రతి సంవత్సరం 1,200 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు.