Assam CM: మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగిందని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని బోరా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. బోరా ప్రకటన ఖండనార్హమని ఇది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందని అసోం సీఎం శర్మ ఆక్షేపించారు. కృష్ణుడు, రుక్మిణిలను లవ్ జిహాద్ వివాదంలోకి లాగడం తగదని హితవు పలికారు. తాము ఏ వివాదంలోకి హజ్రత్ మహ్మద్, జీసస్ క్రీస్తును లాగడం లేదని.. అదేవిధంగా మీరు కృష్ణుడిని వివాదంలోకి లాగవద్దని కోరారు. నేర కార్యకలాపాలతో దేవుడుని పోల్చడం సరైంది కాదని హిమంత బిశ్వ శర్మ హితవు పలికారు.
Read also: Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ
ఈ వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేస్తామని, సనాతన మతానికి చెందిన వేలాది మంది ఫిర్యాదులు చేస్తే ఇక ఆయనను తాము కాపాడలేమని బోరాను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. మహాభారతాన్ని ప్రస్తావిస్తూ బోరా చేసిన వ్యాఖ్యలను శర్మ ఉటంకించారు. రుక్మిణిని తన మతం మార్చుకోవాలని కృష్ణుడు ఎన్నడూ ఒత్తిడి చేయలేదని గుర్తుచేశారు. తప్పుడు గుర్తింపుతో బాలికను పెండ్లి చేసుకుని ఆపై బలవంతంగా ఆమె మతం మార్చడం లవ్ జిహాద్ కిందకు వస్తుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.