NTV Telugu Site icon

Priyanka Gandhi: ఈ ఘటనపై సిగ్గుపడుతున్నా.. ఐరాస తీర్మానంపై భారత్ ఓటేయకపోవడంపై ప్రియాంకా గాంధీ..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్‌కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.

అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై ఆకస్మిక దాడిలో హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఈ తీర్మానంపై ఓటింగ్ కి దూరంగా ఉంది. దీనిపై ఎక్స్(ట్విట్టర్)లో ప్రియాంకా గాంధీ స్పందిస్తూ..‘‘ మానవత్వాన్ని తుడిచిపెట్టి, ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, కమ్యూనికేషన్, విద్యుత్ పాలస్తీనాలోని లక్షలాది ప్రజలకు నిలిపివేయబడినప్పుడు, మహిళలు, పిల్లల్ని నిర్మూలిస్తున్నప్పుడు మౌనంగా నిలబడి చూస్తుండటం, ఒకదేశంగా మనదేశం జీవితాంతం నిలబడిన ప్రతీదానికి వ్యతిరేకంగా ఉంది’’ అని పోస్ట్ చేశారు. మహాత్మా గాంధీని ఉటంకిస్తూ ‘‘కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుంది’’ అని అన్నారు.

Read Also: Kerala: పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు.. కేరళలో వివాదాస్పద ఘటన..

యూఎన్‌జీఏ బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు, రష్యా, దక్షిణాఫ్రికా మొదలైన 40 కన్నా ఎక్కువ దేశాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి అనుకూలంగా 121 దేశాలు ఓటేయగా.. అమెరికా, ఇజ్రాయిల్ సహా 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఉక్రెయిన్, యూకే వంటి 43 దేశాలు ఓటింగ్ కి దూరంగా ఉన్నాయి. దీనిపై ఇజ్రాయిల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్మానాన్ని తిరస్కరించారు. ఇజ్రాయిల్ కి బదులుగా ‘‘నాజీ టెర్రరిస్టులకు రక్షణ’’ కొందరు ఎస్ అని ఓటేశారని విమర్శించారు.