Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేశారని.. 8 ఏళ్లు గడిచాయి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సంఖ్యను కేవలం 10 లక్షలకు తగ్గించారని విమర్శించారు.
ఉద్యోగాల ఇచ్చే విషయంపై ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ హామీలపై జోక్ పేల్చారు. తాను ఇటీవల ఓ హోటల్ లో ఓ యువకుడిని కలిశానని.. అతను తన జీవితంలో పరిస్థితిని వివరించారని అన్నారు. ‘‘ నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించిందని.. మా నాన్న నాకు వేరే పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్నాడని అమ్మాయి చెప్పింది.’’ అని సదరు యువకుడు తనతో అన్నాడని మంగళవారం గుజరాత్ లో జరిగిన ర్యాలీలో ఓవైసీ అన్నారు. అయితే నేను ఆ అబ్బాయితో ‘‘ మీరు పెళ్లి చేసుకోండి, మోదీ ప్రభుత్వాన్ని నమ్మవద్దు’’ అని చెప్పానని ఓవైసీ అన్నారు.
Read Also: IT Raids Marri Rajashekar Reddy: బీజేపీ పార్టీలో చేరాలని పరోక్షంగా మాపై ఐటీ దాడులు
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన అన్నారు. 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇటీవల గుజరాత్ మోర్బీలో జరిగిన వంతెన దుర్ఘటనకు అధికార బీజేపీ పార్టీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గుజరాత్ ను తయారు చేసిన ఘనత బీజేపీదే అయితే.. కూలిన వంతెన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోర్బీ ఘటనకు కారణం అయిన కంపెనీకి చెందిన ధనవంతును పట్టుకోలేదని విమర్శించారు.
గత వారం గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం కోసం సూరత్ వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తాకింది. కొంత మంది ఆయన ర్యాలీలో ఉండగా మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలను చూపించారు. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 1,5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
