Asaduddin Owaisi assault case: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు తాజగా బెయిల్ లభించింది. అయితే వారికి బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ అసదుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర స్పందన కోరింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇద్దరు నిందితులు సచిన్ శర్మ, శుభమ్ గుర్జార్లకు నోటీసులు జారీ చేసింది. మూడో నిందితుడు అలీమ్ కు మంజూరైన బెయిల్ ను సవాల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ భూభాగాలు రష్యాలో విలీనం.. అధికారికంగా ప్రకటించిన పుతిన్
ఈ కేసును సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 3న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరై, ఢిల్లీ వస్తున్న క్రమంలో అసదుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. హాపూర్ లో ఓ టోల్ గేట్ సమీపంలోకి అసదుద్దీన్ కారు రాగానే నిందితులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్షపాతం, ద్వేషానికి సంబంధించిన నేరానికి ఇది ఉదాహరణ అని.. ఇది హత్యాయత్నానికి దారి తీసిందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో అసదుద్దీన్ పేర్కొన్నారు. నిందితుడు సచిన్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పిటీషనర్ ను బెదిరించాడని పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఈ కేసులో నిందితులు తమ ప్రమేయం లేదని చెప్పలేదని.. పైగా నేరం పట్ల గర్వంగా భావిస్తున్నారంటూ అసదుద్దీన్ తరుపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారాలు కీలకంగా మారాయి. నిందితులు ఇద్దరి నుంచి రెండు పిస్టల్స్, ఓ ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులిద్దరిపై 307 సెక్షన్ హత్యా నేరం కింది పిలుఖువా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.