Congress: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షడు అరవిందర్ లవ్లీ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరగడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే లవ్లీకి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ నేత కన్హయ్య కుమార్‌కి వ్యతిరేకంగా నిరసలు చేపట్టారు. అంతకుముందు తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీ, ఆప్‌కి మద్దతు ఇస్తోందని, ముఖ్యంగా కన్హయ్య కుమార్ ఆప్, ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ని పొగుడుతూ మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇదే కాకుండా అతని అభ్యర్థిత్వంలో సాధారణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలను సంప్రదించలేదని ఆరోపించారు.
Read Also: Daughter’s boyfriend: కూతురు బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపిన తండ్రి..
ఇదిలా ఉంటే లవ్లీపై మిగతా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. లవ్లీ రాజీనామాపై ఢిల్లీ ఇన్‌ఛార్జ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దీపక్ బబారియా స్పందిస్తూ..‘‘ కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఆయన ప్రశ్నలు లేవనెత్తున్నాడు’’ అని అన్నారు. ఒత్తిడి వల్లే ఆయన పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, బాబారితా తన నాయకత్వంలో జోక్యం చేసుకుంటున్నాడని, బాబారియా నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను బహిష్కరించాలని తనపై ఒత్తిడి తీసుకువస్తున్నాడని లవ్లీ ఈ రోజు ఆరోపించారు. తన రాజీనామాకు ఆప్‌తో పొత్తు కూడా ఒక కారణమని అరవిందర్ లవ్లీ సింగ్ తెలిపారు.
లవ్లీపై ఆరోపణలు చేసిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌పై లవ్లీ మద్దతుదారులు దాడి చేశారు. అంతకుముందు ఈ రాజీనామాపై ఆయన మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘పార్టీలో విభేదాలు ఉండవచ్చు. లవ్లీ నిరాశకు గురైతే రాజీనామా చేయాలనుకుంటే, సైలెంట్‌గా అతడి రాజీనామాని మల్లికార్జున ఖర్గేకి ఇవ్వాలి. అతనికి తప్పుడు ఉద్దేశం లేకపోతే ఎలాంటి కారణాలను ప్రస్తావించకుండా మౌనంగా రాజీనామా చేయాలి. ఒక విధంగా ఆయన తన రాజీనామా లేఖను బహిరంగంగా బీజేపీకి అందచేస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ హర్ష్ మల్హోత్రా స్థానంలో లవ్లీని అభ్యర్థిగా ప్రకటిస్తారు’’ అని అన్నారు.