Arvind Kejriwal: ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి ఆప్ అతిపెద్ద ముప్పుగా ఉందని, అందుకే తమ పార్టీపై, నేతలపై అన్ని వైపుల నుంచి దాడులు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. తాను అనేక దాడుల్ని ఎదుర్కొంటున్నానని, ఇప్పుడు తనను అరెస్ట్ చేయాలని బీజేపీ అనుకుంటుందని, తనను అరెస్ట్ చేసినా, తన ఆలోచనల్ని బీజేపీ అడ్డుకోగలదా..? అని సవాల్ విసిరారు.
Read Also: Neti Bharatham: ఒకే పాత్రతో ‘నేటి భారతం’ సినిమా.. ఆసక్తికరంగా ట్రైలర్
అరవింద్ కేజ్రీవాల్ ఇలా విశ్వాస పరీక్ష పెట్టుకోవడం ఇది రెండో సారి. 70 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని చెబుతూ.. బీజేపీ నేతలు తమ ఇద్దరు ఎమ్మెల్యేలను సంప్రదించారిన ఆయన మరోసారి ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు, వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఇచ్చారని, అయినా కూడా తమ ఎమ్మెల్యేలు తలొగ్గలేదని చెప్పారు.
2024 ఎన్ని్కల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2029లో బీజేపీ నుంచి దేశాన్ని ఆప్ విముక్తి చేస్తుందని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు మమ్మల్ని అధికారంలోకి దించాలని చెబుతున్నారని, ఇదే హామీతో మీరు ప్రజల్ని ఓట్లు అడగండి, నేనే మీ కోసం పనిచేస్తా అని అన్నారు. బీజేపీ భవిష్యత్తుపై భయం ఉందని అందుకు కారణం ఆప్ అని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీల ద్వారా తమ మంత్రుల్ని అరెస్ట్ చేసిన తీరును దేశం మొత్తం చూసిందని, ప్రజలు మూర్ఖులని వారు భావిస్తున్నారా.?? అంటూ ప్రశ్నించారు. వారు రామ భక్తులమని చెప్పుకుంటారు, కానీ ఆస్పత్రుల్లో ప్రజలకు వైద్యం అందించరని దుయ్యబట్టారు.