NTV Telugu Site icon

Congress: “అహంకారం, అతి విశ్వాసం”.. కాంగ్రెస్‌ని ఏకిపారేస్తున్న మిత్రపక్షాలు..

Congress Haryana Loss

Congress Haryana Loss

Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్‌లో కూడా బీజేపీ సత్తా చాటింది. అధికారం దక్కకపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.

ఇదిలా ఉంటే, ఈ ఫలితాలు ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ టార్గెట్‌గా మిత్రపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఉద్థవ్ ఠాక్రే శివసేన తన సామ్నా పత్రిక ద్వారా కాంగ్రెస్‌ని విమర్శించింది. ఆప్‌తో పొత్తు పెట్టుకోవడంతో పాటు స్థానిక నాయకుల్లో అవిధేయతను నియంత్రించడంలో విఫలమైందని చెప్పింది. గెలిచే ఇన్సింగ్స్‌ని ఓటమిగా మార్చిందని కాంగ్రెస్‌ని ఎండగట్టింది. అయితే, మిత్ర పక్షం ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యాఖ్యల్ని కాంగ్రెస్ మహరాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. హర్యానా, మహారాష్ట్ర వేర్వేరు రాజకీయ నేపథ్యాల్ని కలిగి ఉన్నాయని, మహారాష్ట్రలో జ్యోతీరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ భావజాలం ఉందని అన్నారు.

Read Also: Haryana Elections: బీజేపీకి పెరిగిన మరింత బలం.. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరిక..

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పొత్తులో ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అతివిశ్వాసం కొంపముంచిందని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గతేడాది చివర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలని సామ్నాలో ప్రస్తావించింది శివసేన, అతి విశ్వాసంతోనే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పింది. భూపిందర్ హుడా, కుమారి సెల్జాల మధ్య ఆధిపత్య పోరుని కూడా సామ్నాలో పేర్కొంది.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ది అహంకారపూరిత ధోరణి అని అభివర్ణించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్ వైఖరిని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై లోతైన సమీక్ష చేసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “హర్యానాలో బిజెపి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ దీనిపై లోతైన చర్చలు జరపాలి, కానీ అది నా పని కాదు” అన్నారు.

Show comments