Kejriwal: గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా చివరకు గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక కూడా వెల్లడించిందని తెలిపారు. తక్కువ మార్జిన్ తోనే అయినప్పటికీ గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం వస్తుందని ఐబీ రిపోర్ట్ చెపుతోందని అన్నారు. ఆప్ ఓట్లను చీల్చాలని బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటయ్యాయని ఆరోపించారు. గుజరాత్ లో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని… బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బలోపేతం చేస్తోందని చెప్పారు. ఆప్ కు పడే ఓట్లలో వీలైనంత వరకు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని అన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను కోరుతున్నానని చెప్పారు.
‘ఐబీ నివేదికతో బీజేపీ కుంగిపోయింది. కాంగ్రెస్, బీజేపీలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. ఆప్ ఓట్లను కొల్లగొట్టే బాధ్యత కాంగ్రెస్‌కు అప్పగించారు’ అని రాజ్‌కోట్‌లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Read Also: Durga Puja: జాతిపితకు అసుర రూపం.. దుర్గా మండపంపై దుమారం
గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 10 సీట్లకు మించి గెలవదని.. విజయం సాధించిన వారూ బీజేపీలో చేరతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడం వృథా. బీజేపీ పాలనతో విసిగిపోయిన వారందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి. దిల్లీ, పంజాబ్ రికార్డులను బద్దలు కొట్టండి’ అని కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను అభ్యర్థించారు.
కాగా, గుజరాత్ కు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ గుజరాత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ దఫా అధికారం తమదేనన్న ధీమాతో ఉండగా.. బీజేపీని ఎలాగైనా ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ , ఆప్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.