Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’పేరుతో రెండు భాగాల డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది యూకే, ఇండియాలో వివాదాస్పదం అయింది. భారత విదేశాంగ శాఖ దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. దీని తర్వాత ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.
Read Also: Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటిస్తుందని ఆశిద్దాం..
ఇదిలా ఉంటే.. తదుపరి ప్రధాని అభ్యర్థి మీరేనా..? అని అక్కడి మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించింది. అయితే ప్రస్తుతానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించడమే ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం అని అన్నారు. నిరుద్యోగం సమస్యల పరిష్కారంపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రజలతో మాట్లాడటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విదేశాల్లో భారత్ ను చెడుగా చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని బీజేపీ విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అయినా చేసిందేం లేదని ప్రధాని విదేశాల్లో అనడం తనకు గుర్తుందని, పదేళ్లలో మనం ఓడిపోయామని అన్నారని, భారత్ లో అపరిమిత అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
నేనెప్పుడూ దేశం పరువు తీయలేదని, 70 ఏళ్లలో ఏమీ జరగలేదని చెప్పడం ప్రతీ భారతీయుడిని అవమానించడం కాదా..? అని ప్రశ్నించారు. భారత సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘనను అనుమతించమని చైనా విషయంలో కామెంట్ చేశారు. వాస్తవేమిటంటే చైనా ఆర్మీ భారత భూభాగంలోకి వచ్చి, మన సైనికులను చంపారని, ప్రధాన మంత్రి దీన్ని తిరస్కరించారని రాహుల్ ఆరోపించారు.