NTV Telugu Site icon

Terrorist Yasin Malik: యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరిన ఎన్ఐఏ.. విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..

Terrorist Yasin Malik

Terrorist Yasin Malik

Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు. ఎన్ఐఏ అప్పీల్‌పై అంతకుముందు బెంజ్ యాసిన్ మాలిక్ ప్రతిస్పందనను కోరింది. దీనిని అరుదైన కేసుగా పేర్కొంది. ఈ అప్పీల్ గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యం విచారణకు రాగానే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు. ఢిల్లీ హైకోర్టు దీనిని వివిధ బెంచ్‌ల ముందు ఆగస్టు 9వ తేదీని జాబితా చేసింది.

మే 2023లో, టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్ఐఏ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ మరియు జస్టిస్ తల్వంత్ సింగ్‌లతో కూడిన బెంచ్, యాసిన్ మాలిక్ తీహార్ జైలులో ఉన్నందున, జైలు సూపరింటెండెంట్ ద్వారా యాసిన్ మాలిక్‌కు నోటీసు జారీ చేసింది.

అంతకుముందు ఎన్‌ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నలుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందిని హతమార్చి, రుబయ్యా సయీద్‌ని కిడ్నాప్ చేసినందుకు యాసిన్ మాలిక్ కారణమని వాదించారు. ఈ కిడ్నాప్ తరుపున విడుదలైన నలుగురు ఉగ్రవాదులు 26/11 ముంబై దాడులకు సూత్రధారులగా ఉన్నారని కోర్టుకు చెప్పారు. ఆయుధాల నిర్వహణలో శిక్షణ పొందేందుకు నిందితుడు యాసిన్ మాలిక్ 1980లలో పాకిస్థాన్‌కు వెళ్లాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అతను జేకేఎల్ఎఫ్ అధిపతి కావడానికి పాక్ ఐఎస్ఐ సాయం చేసింది.

Read Also: Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి

ఎన్ఐఏ తన అప్పీల్‌లో ఇలాంటి భయంకరమైన టెర్రరిస్టులు నేరాన్ని అంగీకరించిన తర్వాత మరణశిక్ష విధించకపోతే, అది దేశ శిక్షా విధానంపై ప్రశ్నలు వస్తాయని పేర్కొంది. ఇలాంటి భయంకరమైన ఉగ్రవాది దేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యలో పాల్గొనడం, నిర్వహించడం, నాయకత్వం వహించిన తర్వాత మరణశిక్ష విధించాలని కోర్టులో అప్పీల్ చేసింది. ఇలాంటి ఉగ్రవాదుల వల్ల దేశం తన విలువైన సైనికులను కోల్పోయిందని, సైనిక కుటుంబ సభ్యులకే కాకుండా యావత్ ప్రజలకు కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని ఎన్‌ఐఏ తన అప్పీల్‌లో పేర్కొంది.

అంతకుముందు మే 25, 2022న, టెర్రర్ ఫండింగ్ కేసులో JKLF నాయకుడు యాసిన్ మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి తీర్పు చెబుతూ.. ఈ దోషికి సంస్కరణ లేదు, 1994లో తాను తుపాకీని వదులుకున్నాడనేది సరైనదే కావచ్చు, కీనా కానీ 1994 సంవత్సరానికి ముందు అతను చేసిన హింసకు అతను ఎప్పుడూ విచారం వ్యక్తం చేయలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నేరం జరిగిన తీరు, నేరంలో ఉపయోగించిన ఆయుధాల తీరు, అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా అభివర్ణించారు. NIA కోర్టు, యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ, రూ. 10 లక్షల పైన జరిమానా కూడా విధించింది.