Bengaluru cafe blast: మార్చి 1న బెంగళూర్‌లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నిస్తున్నాయి. నిందితుడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసిన ఎన్ఐఏ, అతడిని పట్టుకునేందుకు ప్రజల సాయాన్ని కోరింది. ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది.
అయితే, ఈ పేలుడులో కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్న శివమొగ్గ ఐసిస్ మాడ్యుల్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాడ్యుల్ ఈ ప్రాంతంలోని యువతను ర్యాడికలైజ్ చేసే పనిలో ఉంది. ఈ మాడ్యుల్ పేలుడు జరిగిన రోజున నిందితులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడానికి సాయపడినట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. పేలుడు పదార్థాలు సేకరించడంలో కూడా వీరి హస్తమున్నట్లు తేలినట్లు సమాచారం. శివమొగ మాడ్యూల్ సహాయంతో తమిళనాడు, కేరళకు చెందిన అనుమానితులు కర్ణాటకలోకి ప్రవేశించి కేఫ్‌లో పేలుడుకు ఎలా పాల్పడ్డారనే దానిపై ఇప్పుడు ఎన్‌ఐఏ సమగ్ర విచారణ జరుపుతోంది.
ఈ కేసులో కీలక నిందితుడిని బుధవారం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. కర్ణాటక బళ్లారి జిల్లాకు చెందిన అనుమాతుడిని షబ్బీర్‌గా గుర్తించినట్లు సమాచారం. కర్ణాటకలోని తీర్థహళ్లిలోని ఈ మాడ్యుల్‌కి చెందిన 11 మంది వ్యక్తులు ఇటీవల సంవత్సరాల్లో దక్షిణ భారతదేశం అంతటా తమ నెట్వర్క్‌ని విస్తరిస్తున్నారు. ఈ మాడ్యుల్ యువతను తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి మత పెద్దల్ని ఉపయోగించుకుంటోంది.